ధన త్రయోదశి సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. త్రయోదశి రోజు బంగారం, వెండితో పాటు ఏవైనా వంట సామగ్రి కొనుగోలు చేస్తే శుభప్రదమని నమ్మకం. అనాదిగా కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో జనం బిజీగా గడుపగా, భారీస్థాయిలో కొనుగోళ్లు జరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 : ధనత్రయోదశినాడు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడంతోపాటు చాలామంది మహిళలు బంగారమో, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు, కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజిస్తారు. ఇలా చేస్తే వారికి అదృష్టం వరిస్తుందని నమ్మకం. మంగళవారం శివారు ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున బంగారం, వెండి, వంట సామగ్రిని కొనుగోలు చేశారు. కొనుగోలుదారులతో ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, యాచారం, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి, వంట సామగ్రి దుకాణాలు ప్రజలతో కళకళలాడాయి.