షాద్‌నగర్, నవంబర్ 2 : రైతుల కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయాలి, మిల్లర్లు లారీలను కూడా కల్లాల వద్దకే తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అధికారులు, మిల్లర్లకు సూచించారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా రైతులు సుమారు 37 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. దీంతో సుమారు 85 వేల 438 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులకు తెలిపారు. జిల్లాలోనే షాద్‌నగర్ నుంచి అధిక ధాన్యం మార్కెట్‌కు వస్తుందని చెప్పారు. రైతులకు గోనె సంచులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. 21,35,950 గోనె సంచులు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు.
తాత్కాలిక గోదాంలు ఏర్పాటు చేయాలి..
ధాన్యం నిల్వలకు తగిన ఏర్పాట్లు చేయాలని, మార్కెట్ యార్డుల పరిధిలో ఉన్న గోదాంలతో పాటు ప్రైవేట్ గోదాంలను ఉపయోగించుకోవడంతో పాటు తాత్కాలికంగా గోదాంలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులు, మిల్లర్లకు చెప్పారు. ధాన్యం నాణ్యత, విక్రయాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కోరారు. మిల్లర్లు రైతును ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. అధికారులు, మిల్లర్లు సహకరిస్తే రైతులకు ఇబ్బందులు రావన్నారు. రైతు పంటను అమ్ముకునే విషయంలో బాధపడొద్దని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ రాజరత్నం, ఎఫ్‌సీఐ అధికారి రాజేందర్‌సింగ్, పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్లు బక్కన్నయాదవ్, మంజుల, అశోక్, దామోదర్‌రెడ్డి, మిల్లర్ల అసోసియేషన్ సభ్యుడు కొట్ర రాజు, మండలాల ఏవోలు, పీఏసీఎస్‌ల సీఈవోలు, మార్కెట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
హరిత మున్సిపాలిటే లక్ష్యం
కొత్తూరు, నవంబర్ 2 : హరిత మున్సిపాలిటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు వద్ద మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని హరితమయంగా మార్చేందుకు ప్రతి గ్రామం, వార్డుల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనివల్ల ప్రతి గ్రామానికి కావాల్సిన మొక్కలను అక్కడ ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి తీసుకోవచ్చన్నారు. దీంతో ప్రజలకు మొక్కలు పెంచాలన్న ఆలోచన వస్తుందని వివరించారు. అంతే కాకుండా పరిశ్రమలు అధికంగా ఉన్న కొత్తూరులో కాలుష్యం నుంచి ప్రజలు భయటపడాలంటే ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. దీంతో మున్సిపాలిటీ హరితమయంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కౌన్సిలర్ శ్రీను, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు భగవద్గీత, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, జనార్దనచారి, బీసీసెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.