అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందజేయడంతో పాటు రైతు మృతి చెందితే రూ.5లక్షల బీమా అందజేస్తూ రైతు కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నది. ప్రతి ఏటా జిల్లా రైతుల పేరిట రూ.3487 ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే నామినీ ఖాతాలో 15 రోజుల్లోగా బీమా డబ్బులు జమ చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 1267 మంది రైతులు మృతిచెందగా, ఇప్పటివరకు 1183 మంది రైతు కుటుంబీకులకు రూ. 59.15కోట్లను అందించింది. మిగిలిన 84 మంది కుటుంబీకులకు త్వరలో బీమా డబ్బులు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని జిల్లా రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
షాబాద్, నవంబర్ 2 : రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించి ఆదుకుంటున్నారు. రైతు బంధు పథకం ద్వారా ఏడాదిలో రెండు విడుతలు ఎకరాకు రూ.5వేల చొప్పున పంట సాయం అందించడంతో పాటు గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5లక్షల ప్రమాదబీమా సదుపాయం కల్పించింది. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ప్రతి ఏడాది రైతు పేరిట రూ.3487 ప్రీమియం డబ్బులు ఎల్ఐసీకి చెల్లిస్తున్నది. ఏ కారణంగానైనా రైతు మృతిచెందితే నామినీగా ఉన్న భార్య, కొడుకు, కూతురు బ్యాంకు ఖాతాల్లో 15రోజుల వ్యవధిలో ప్రభుత్వం బీమా డబ్బులు జమచేస్తుంది. ఆయా గ్రామాల్లోని క్లస్టర్లలో ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉంటున్న ఏఈవోలు రైతు బీమాకు సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాల నుంచి సేకరించి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గతేడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 1267 మంది రైతులు మృతిచెందగా, అందులో ఇప్పటివరకు 1183 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.59.15కోట్లు బీమా డబ్బులు అందించారు. మిగతా రైతులకు త్వరలో బీమా డబ్బులు అందనున్నాయి. ప్రభుత్వం బీమా సదుపాయంతో అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటుండడంతో సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో 1183 మందికి బీమా సాయం
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 1267 మంది రైతులు మృతిచెందారు. 1183 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.59.15కోట్లు బీమా సాయం అందింది. మిగతా 84మంది రైతులకు కూడా త్వరలో బీమా సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాలాపూర్ మండలంలో నలుగురికి, కందుకూరులో 63, మహేశ్వరం 60, అబ్దుల్లాపూర్‌మెట్ 29, ఇబ్రహీంపట్నం 59, మంచాల 59, యాచారం 38, చేవెళ్ల 74, మొయినాబాద్ 41, షాబాద్ 90, శంకర్పల్లి 72, ఫరూఖ్‌నగర్ 74, చౌదరిగూడెం 50, కేశంపేట్ 66, కొందుర్గు 61, కొత్తూర్ 29, నందిగామ 42, గండిపేట్ 3, శంషాబాద్ 47, ఆమనగల్లు 39, కడ్తాల్ 39, తలకొండపల్లి 68, మాడ్గుల మండలంలో 76 మంది రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున బీమా సాయం అందించినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
రైతులకు అండగా పలు పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా అందిస్తున్న రూ.5లక్షల సాయం అన్నదాతల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నది. వివిధ కారణాలతో చనిపోతున్న రైతుల కుటుంబాలను గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులు పడిన సంఘటనలున్నాయి. ఒక రైతుబిడ్డగా స్వరాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా రూ.5 లక్షల బీమా సదుపాయం, వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1183 మందికి బీమా సాయం
బీమా డబ్బులు వచ్చాయి : బాలమణి, మద్దూర్, షాబాద్
అనారోగ్యంతో నా భర్త మృతిచెందాడు. ఆయన పేరుపై 1-20గుంటల భూమి ఉంది. నామినీగా ఉన్న నా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నుంచి రూ.5లక్షల బీమా డబ్బులు జమ చేశారు. ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించి రైతులకు బీమా అందించడం గొప్ప పరిణామం. బీమా డబ్బులు మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఆదుకోవడం సంతోషకరం – లావణ్య, కేసారం, చేవెళ్ల
రైతు బీమా పథకం ద్వారా ప్రభుత్వం పేద రైతు కుటుంబాలను ఆదుకోవడం సంతోషకరం. కొద్దిరోజుల క్రితం నా భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 20రోజుల వ్యవధిలో నాకు రూ.5లక్షలు బీమా అందించి ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకుంది. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.