షాబాద్, నవంబర్ 2: అటవీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్ లో అడవుల సంరక్షణపై మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా అట వీ భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అటవీ భూము ల గుర్తింపు చట్టం అమలులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులకు నెల రోజుల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని మంత్రి కోరారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి అటవీ భూములకు సంబంధించిన హక్కుల కో సం దరఖాస్తులను స్వీకరిస్తామని, ఇందుకోసం నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అవసరమైన చోట్ల రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో సర్వే నిర్వహిస్తారని.. అట వీ ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్డు ఉన్న ప్రాం తాల్లో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రాష్ట్రం లో అటవీ ప్రాంతాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలను నాటించారని కొనియాడారు. అనంతరం రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా 12,43, 160,10 ఎకరాల వైశాల్యం కలిగి ఉన్నదని, అందులో 73,007,91 ఎకరాల అట వీ విస్తీర్ణం, 84 అటవీ బ్లాకులుగా ఉందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు వెంకటచారి, రాజేశ్వరి, వేణుమాధవ్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీల ప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.