హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ లేఖ రాశారు. ‘నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకొన్న మీరు.. శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలుసాధించి అందరి మన్ననలు అందుకొంటారని భావిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.