జడ బొబ్బర.. ఈ ఒక్క పంట సాగులో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నది. అంతగా సారవంతం కాని నేలల్లోనూ అధిక దిగుబడిని ఇస్తున్నది. నీటి ఎద్దడిని సైతం తట్టుకొని నిలబడుతున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విరగ కాస్తున్నది. వేరు బొడిపెల ద్వారా నత్రజనిని స్థిరీకరించి, భూమిని మరింత సారవంతం చేస్తున్నది. ప్రధాన పంటల్లో అంతర పంటగా వేస్తే.. కలుపునూ నివారిస్తున్నది. అందుకే, ‘జడ బొబ్బర’ సాగుకు రైతాంగం ఆసక్తి చూపుతున్నది.
తెలంగాణలో యాసంగి సాగుకు అనుకూలమైన ఆరుతడి పంటల్లో జడ బొబ్బర ముఖ్యమైనది. వరి మాగాణుల్లో కోతల అనంతరం, మిగిలిన భూసారంతోనే మంచి దిగుబడి ఇస్తుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే, తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పంట ఇది. ఈ కాయలను కాయకూరగానే కాకుండా, గింజలను పప్పుగానూ ఉపయోగిస్తారు. అందుకే, దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
నేలలు, వాతావరణం
మురుగు నీటి సౌకర్యం ఉన్న ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు, జడ బొబ్బర సాగుకు అత్యంత అనుకూలం. అధిక వేడి, అధిక చలి లేని ప్రాంతాల్లో ఏడాదంతా సాగవుతుంది. 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉండే వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఈ పంట ఎదుగుదలకు అనుకూలం. యాసంగిలో సాగు చేయాలనుకొనే రైతులు, ఫిబ్రవరిలో విత్తనాలు వేసుకోవచ్చు. లేదా జూన్ -జూలై మధ్య, సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కూడా ఈ పంటను పండించవచ్చు. జడ బొబ్బరను ఏక పంటగానే కాకుండా, అంతర పంటగా, ఆకుకూరగా, పప్పు దినుసుల కోసం కూడా సాగు చేయవచ్చు. వరి కోతల అనంతరం మాగాణుల్లో తర్వాత పంటగానూ వేసుకోవచ్చు.
రకాలు
అర్క మంగళ : బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ రూపొందించిన రకమిది. తీగ 3-4 మీటర్ల దాకా పారుతుంది. కాయలు 80 సెం.మీ పొడవు పెరుగుతాయి. లేత ఆకుపచ్చగా, చిక్కు లేకుండా రుచిగా ఉంటాయి. 60 రోజుల్లోనే మొదటి కోత చేసుకోవచ్చు. వానకాలంతోపాటు యాసంగి సాగుకు అనుకూలం. వంద రోజుల్లో హెక్టారుకు 25 టన్నులదాకా దిగుబడి ఇస్తుంది.
సహస్ర (ఆర్సీహెచ్వైబి-1) : ఈ రకాన్నే తెలంగాణ పెద్ద, పొడుగు బొబ్బర్లు అంటారు. తీగ 2.81 మీటర్లు పారుతుంది. 43 రోజుల్లో పూతకు వచ్చి, 76 రోజులకు మొదటి కోతను ఇస్తుంది. 100 రోజుల్లో హెక్టారుకు 16-17 టన్నుల దిగుబడి సాధించవచ్చు. లోలా రకంతో పోలిస్తే 30 శాతం దిగుబడి ఎక్కువ. సహస్ర రకం కాయలు లేత ఆకుపచ్చగా, చిక్కు లేకుండా ఉండి, మృదువుగా, రుచిగా ఉంటాయి. ఒక్కో కాయలో 16 గింజలు ఉండి, ఎరుపు రంగులో మూత్ర పిండాల ఆకారంలో ఉంటాయి. వీటిలో 23 శాతం ప్రొటీన్ ఉంటుంది. పేనుబంకను సమర్థంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పిడిగెం సైదయ్య నేతృత్వంలో అభివృద్ధి చేశారు.
విత్తన మోతాదు/ నేల తయారీ
పొద రకం సాగుకు హెక్టారుకు 25 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. తీగ రకాలైతే హెక్టారుకు 10 నుంచి 12 కేజీలు సరిపోతాయి. వరుసల మధ్య 60 సెం. మీ. వరుసల్లోని మొక్కల మధ్య 30 సెం. మీ. ఉండేలా విత్తుకోవాలి. అంతకుముందే నేలను సిద్ధం చేసుకోవాలి. నేల మెత్తగా ఉంటేనే మొలకశాతం ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం పొలాన్ని రెండుమూడు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో హెక్టారుకు 25 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 25-60-50 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాషియం వేసి కలియ దున్నుకోవాలి. తేమతో కూడి, వదులుగా ఉన్న నేలలో, బోదెలకు ఒకవైపు మాత్రమే విత్తనం వేయాలి. ఆ సమయంలో నేల తడిగా ఉండేలా చూసుకోవాలి. విత్తనం వేసిన తర్వాత సిఫారసు చేసిన మొత్తంలో సగం నత్రజనితోపాటు భాస్వరం, పొటాషియం మొత్తాలను పక్క వరుసలో వేసి మట్టి కప్పాలి. 25-30 రోజుల తర్వాత మిగతా సగం నత్రజనిని వేసి, మట్టిని ఎగదోయాలి.
సాగు యాజమాన్యం :
కోత/ దిగుబడి
సాగు చేసిన రకాన్ని బట్టి పంట కోతకు వస్తుంది. బాగా పెరిగిన లేత కాయలను తెంపి, ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేయాలి. కాయలు మెత్తగా ఉండి, పీచు ఏర్పడక ముందే కోసేయాలి. 4- 5 రోజులకు ఒకసారి కాయలు తెంపుకోవచ్చు.
అనుకూల పంట..
జడ బొబ్బర అత్యంత పోషకాలున్న పంట. ఇందులో ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని కాయకూరగా, గింజలను పప్పు దినుసులుగా ఉపయోగించవచ్చు. తెలంగాణ నేలలు, వాతావరణానికి అనుకూలమైనది. ఏక పంటగా, ప్రధాన పంటల్లో అంతర పంటగానూ సాగు చేసుకోవచ్చు. ఏ కాలంలోనైనా సాగవుతుంది. తక్కువ నీటిని వినియోగించుకుంటుంది. హెక్టారుకు రకాన్ని బట్టి 25 టన్నులకుపైగా దిగుబడిని ఇస్తుంది. పంట సాగు అనంతరం భూమిలో నత్రజని స్థిరంగా ఉండేలా కాపాడుతుంది.
– డాక్టర్ పిడిగెం సైదయ్య, అసోసియేట్ ప్రొఫెసర్
(జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్)