హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకూ మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇకనుంచి అటువంటి వెలుసుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఎక్కడైనా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే.. గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే కొత్త విధానం రూపుదిద్దుకుంటున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనకు అటు రవాణాశాఖ, ఇటు పోలీసు శాఖ కార్యరూపం ఇచ్చాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా తీసుకుంటున్నారు. గత నెల 12న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన
ప్రకారమే ఆర్టీఏ అధికారులు వాహనాల నూతన రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు అకౌంట్ నంబర్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్, కనీసం మూడు నెలల స్టేట్మెంట్కు సంబంధించిన జిరాక్స్‌లు తీసుకుంటున్నారు. గతంలో ట్రాఫిక్ చలాన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే, రేవంత్ సర్కార్ మాత్రం ఉన్నది ఊడ్చేందుకు సిద్ధమైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకు లావాదేవీలపై ‘ట్రాఫిక్’ కన్ను
చలాన్ పడిన వెంటనే బ్యాంకు అకౌంట్ నుంచి కట్ కావడమంటే.. ఆ బ్యాంకు ఖాతాపై ట్రాఫిక్ పోలీసుల అజమాయిషీ ఉంటుందని పలువురు వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మన బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు ఉన్నది? ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి? ఎక్కడికి డ బ్బులు పంపుతున్నాం? అనే విషయాలు వారికి కూడా తెలిస్తే.. ఇక వ్యక్తిగత గోప్యత ఏ ముంటుందని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ చలా న్లు కట్ చేసుకోవడం కోసం, ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించిన వెంటనే.. దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయకుండా, వాహనదారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా, మునుపెన్నడూ లే నివిధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం బ్యాం కు ఖాతాల వివరాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకు ఖాతా ఇస్తేనే పత్రాల అప్లోడ్
తెలంగాణ రవాణాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమాని బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు తీసుకొని.. సిస్టమ్‌లో నమోదు చేస్తున్నారు. అవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు అప్లోడ్ కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 12న అలా ప్రకటించారో లేదో.. జనవరి చివరి వారం నుంచే రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల జాబితాలో బ్యాంకు ఖాతా వివరాలు కూడా పొం దుపర్చారు. అవి తెస్తేనే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తామని షోరూంల నిర్వాహకులు, డీలర్లు బోర్డులు పెట్టారు. దీంతో ఇది చలాన్ల ఆటోడెబిట్ కోసమేనని వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా డబ్బుల వసూళ్లు
వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం షోరూంలు, డీలర్లకు అప్పగించడంతో.. వారు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. పలు షోరూంలు ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అత్యధిక చార్జీలు వేస్తూ.. డబ్బులు దండుకుంటున్నాయనే ఫిర్యాదులు ఆర్టీఏ కార్యాలయానికి అందుతున్నాయి. అడపాదడప పలు షోరూంలకు నోటీసులు ఇచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దులుపుకొంటుండటంతో.. డీలర్లు ఆడిందే ఆటగా సాగుతున్నదని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ మోపిన సర్వీస్ చార్జీలు, లైఫ్‌ట్యాక్స్ భారంతో చతికిలపడిన వాహనదారుల నుంచి.. ఇన్సూరెన్స్, ఆర్టీవో చార్జీలు, యాక్సెసరీస్, హెచ్ఎస్ఆర్పీ వంటి వాటి పేరుతో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇప్పటికిప్పుడు లింకేజీలేమీ లేవు
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై వాహనదారుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నది. దీనిపై అటు ముఖ్యమంత్రి, రవాణశాఖ మంత్రి ఎవరూ స్పష్టంగా వివరణ ఇవ్వకపోవడంతో వాహనదారుల ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక ఆర్టీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్టీఏ అధికారులను మీడియా ప్రశ్నించగా.. ఇప్పటికిప్పుడు బ్యాంక్ ఖాతాలతో ఎలాంటి లింకేజీలు లేవని చెప్తున్నారు. కానీ, వాహనదారుల్లో మొదలైన ఆందోళనలకు సరైన స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రవాణాశాఖ చేపట్టిన ఈ కొత్త విధానంపై కోర్టులు స్పందించాలని సగటు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. తమ బ్యాంకు అకౌంట్లపై అజమాయిషీ చెల్లించే హక్కు రవాణాశాఖకు, ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడదని నిలదీస్తున్నారు.
‘ఎవరిమీదైననా చలాన్ వేస్తే.. ఒక్కపైసా తగ్గించకండి. వాళ్ల బ్యాంకు అకౌంట్స్ నుంచే నేరుగా డబ్బులు కట్ అయ్యే విధంగా సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలాన్ పడినా ఆటోమెటిక్‌గా డిడెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోండి. వాహనం రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడే దాని యజమాని బ్యాంకు ఖాతాను తీసుకోండి. బ్యాంక్ అకౌంట్‌ను ట్రాఫిక్ విభాగానికి అటాచ్ చేయండి. ఏ బండైతే వేగంగా వెళ్తుందో.. ఎక్కడైతే సిగ్నల్ జంప్ అవుతుందో.. ఆటోమెటిక్‌గా యజమాని అకౌంట్ నుంచి నగదు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి. ఇందుకు బ్యాంకులను సమన్వయం చేసుకోండి.’
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (అరైవ్ అలైవ్ ప్రారంభోత్సవంలో జనవరి 12న)