నిజామాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేకుండా పోయింది. మూర్ఖపు వ్యక్తుల మూలంగా టీయూ పరువు నడి బజారులో మంట కలుస్తోంది. పూర్వ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి దేశ వ్యాప్తంగా టీయూ పేరును గంగలో కలిపారు. తాజాగా అక్రమ నియామకాలను హైకోర్టు కొట్టేయడంతో మరోసారి తెలంగాణ యూనివర్సిటీ అక్రమాల తంతుపై దుమారం జరుగుతోంది. యూనివర్సిటీలకు చాన్స్‌లర్ హోదాలో అధిపతిగా పని చేసే గవర్నర్‌కు తప్పుడు సమాచారం సమర్పించినట్లుగా టీయూలో తాజాగా చర్చ నడుస్తోంది. 2025, జూలై 16న జరిగిన 2వ స్నాతకోత్సవ సమావేశంలో సమర్పించిన ప్రగతి నివేదికలో కొన్ని వివరాలను గోప్యంగా పెట్టారని ప్రచారం నడుస్తోంది.
2012 నియామకాలకు సంబంధించిన అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లలేదని టీయూ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌కు విశ్వవిద్యాలయాల్లో జరిగే పాలకమండలి సమావేశాలు, ఆడిట్ రిపోర్ట్లు, నియామకాల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలి. నివేదికల్లో కులంకషంగా వివరాలను పొందుపర్చాలి. కానీ స్నాతకోత్సవ వేదికగా గవర్నర్‌కు ఈ అక్రమ నియామకాల సమాచారాన్ని చేరవేయలేదని తెలుస్తోంది. కేవలం పట్టాల పంపిణీతోనే కార్యక్రమాన్ని సరిపెట్టి హడావిడిగా ముగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణ యూనివర్సిటీలో రాజ్యాంగ వ్యవస్థలకు విలువ లేకుండా పోతోంది. అవినీతి, అక్రమాలకు బరితెగిస్తున్న కొంత మంది తీరుతో ఓ వైపు యూనివర్సిటీ పరువు పోతుండగా మరోవైపు చట్ట ఉల్లంఘనలు ఘోరంగా వెలుగు చూస్తున్నాయి. వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్, బోధన, బోధనేతర సిబ్బంది ఎవరైనా సరే దేశంలోని చట్టాల ప్రకారమే పని చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించడం, తీర్పులను అమలు చేయడం తప్పనిసరి.
రాజ్యాంగ విలువలకు పెద్ద పీట వేయాల్సిన యూనివర్సిటీలో అందుకు భిన్నమైన పరిస్థితులు దాపురించడం హాస్యాస్పదంగా మారింది. విశేష అధికారాల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పూర్వ వైస్ చాన్స్‌లర్ అనతికాలంలోనే జైలు గోడల మధ్య ఊచలు లెక్కించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఉదంతాన్ని ప్రస్తుతం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. విశ్వవిద్యాలయాన్ని కాపాడాల్సిన వారే ముందుండి వక్రబుద్ధితో పాలన సాగిస్తుండటంతో టీయూకు మరక అంటుతోంది. యూనివర్సిటీ పెద్దల వైఖరి రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉందని టీయూ వర్గాలే ఆరోపిస్తున్నాయి.
ఈ పరిణామాలు యూనివర్సిటీని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ 2006లో స్థాపించబడినప్పటికీ దాని చరిత్ర వివాదాలతో నిండి పోయింది. 2014లో నాటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహాన్ స్వయంగా అక్రమ నియామకాలపై దృష్టి సారించడంతోనే అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక మాదిరిగానే హైకోర్టు తీర్పు రావడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నరసింహన్ తర్వాత తమిళిసై, సి.పి.రాధాకృష్ణన్ కొద్ది కాలం పని చేశారు. ప్రస్తుతం గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ కొనసాగుతున్నారు. తమిళిసై, జిష్ణుదేవ్ టీయూను సందర్శించిన వారిలో ఉన్నారు.
నిత్యం వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న తెలంగాణ యూనివర్సిటీ వ్యవహారాలపై రాజ్‌భవన్ వర్గాలు సీరియస్‌గా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గత నెల 31న కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో టీయూలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు గవర్నర్ కార్యాలయం వివరాలు ఆరా తీసినట్లుగా సమాచారం. 2012 నోటిఫికేషన్లలో చోటు చేసుకున్న తప్పులు, అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీసినట్లుగా టీయూ వర్గాలు చెబుతున్నాయి. 13ఏండ్ల క్రితం జారీ చేసిన ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడంతో హైకోర్టు స్టే విధించింది. స్పందించిన నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏకంగా మాజీ న్యాయమూర్తి జస్టీస్ సి.వి. రాములుతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి వివరాలు రాబట్టారు.
ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగి గత నెల లో తుది తీర్పునకు నోచుకోవడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు రద్దు కాబడ్డాయి. హైకోర్టు తీర్పు వెలువడే వరకూ రాజ్‌భవన్ వర్గాలకు 2012 నోటిఫికేషన్ల సమాచారం అందుబాటులో లేదు. తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఎలాంటి వివరాలు అప్డేట్ కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా చేష్టాలుడిగి కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడుతున్నట్లే గవర్నర్‌కు సమాచారాన్ని పంపకుం డా రాజ్యాంగ విలువలను టీ యూ పాతరేస్తోంద న్న విమర్శలు పెరుగుతున్నాయి.