నిజామాబాద్, మే 31, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాటలు కోట దాటితే… చేతలు గడప దాటడం లేదన్నట్లుగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరు. వచ్చే డిసెంబర్‌కు మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదు. ఐదేళ్ల పరిపాలనలో సగం రోజులు గడిపేసినప్పటికీ వాగ్ధానాల అమలులో అతీగతీ కరువైంది. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్‌లో కల్లబొల్లి మాటలు వల్లించారు. పీసీసీ చీఫ్ హోదాలో నాడు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లుగా హామీలు గుప్పించాడు. కేసీఆర్ పాలనలో సవ్యంగా అమలవుతోన్న రైతుబంధు పెట్టుబడి సాయం పథకాన్ని ఎద్దేవా చేశాడు. సంవత్సరానికి మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలంటూ మాట్లాడాడు. ఎందుకివ్వకూడదంటూ నాడు బీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీశాడు. రైతులను లేనిపోని ఆశచూపి రెచ్చగొట్టాడు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తుండగా ఏడాదికి కనీసం ఒక సీజన్‌కైనా సరిగా పెట్టుబడి సాయాన్ని అందించలేక చతికిల పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే రైతుభరోసా పథకాన్ని అరకొరగా అందిస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. పేరుకు ప్రజాపాలన పేరిట భారీగా ప్రచారం చేసుకుంటూ రైతులను నిలువునా ముంచుతున్నారు. గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు మూడు సీజన్లో పూర్తిగా పెట్టుబడి సాయం అందకపోగా మిగిలిన పంట కాలానికి సగం మందికి కూడా సరిగా నగదు సాయం మంజూరు కాలేదు. జూన్‌తో మొదలైన వానాకాలం పంటల సాగు కాలం అక్టోబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. యాసంగి సీజన్‌కు రైతుభరోసా పూర్తి స్థాయిలో అందలేదు. అంతలోనే మరో పంట కాలం వచ్చింది. పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారో? ఇవ్వరో? తెలియక రైతులు ఆగమాగం అవుతున్నారు.
అధికారంలోకి వస్తే ఎకరానికి ఏటా రూ.15వేలు పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. కేసీఆర్ ఇస్తోన్న రూ.10వేలకు అదనంగా రూ.5వేలు ఇస్తామంటూ ఇబ్బడి ముబ్బడిగా ఎన్నికల సభల్లో కాంగ్రెస్ నేతలంతా మాట్లాడారు. పరిపాలన చేపట్టి మూడేళ్లు దగ్గర పడుతున్నప్పటికీ పెట్టుబడి సాయం రూ.15వేలు అమలు కావడం లేదు. ఇందులో రూ.3వేలు కోత పెట్టి రైతులకు మోసం చేస్తున్నారు. ఏటా రూ.12వేలు మాత్రమే అందిస్తామంటూ ప్రకటించి ఒక సీజన్లో ఎకరానికి రూ.6వేలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా వింత విధానాలతో పెట్టుబడి సాయాన్ని అమలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటోంది.
గడిచిన యాసంగి సీజన్లో రైతుభరోసా పథకం అమలైన తీరుపై రైతన్నలంతా ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. రైతులందరికీ ఎకరానికి రూ.6వేలు అందిస్తామంటూ చెప్పుకుంటూ సీజన్ ముగింపులో ఒక దశలో ఒక ఎకరానికి, మరో విడతలో మరో ఎకరానికి సాయం మంజూరు చేసి కేవలం 2 ఎకరాలకే రైతుభరోసాను పరిమితం చేశారు. మిగిలిన ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. మిగిలిన నగదు సాయంపై రైతులు ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భిన్నంగా మాట్లాడుతున్నారు. రైతుభరోసా ఘనంగా అమలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటుండటంతో అధికార పార్టీ నేతల తీరుపై రైతన్నలంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
యాసంగి పంట కాలం ముగిసింది. వానాకాలం సీజన్ ఆరంభమైంది. యాసంగిలో ఇస్తామని చెప్పిన రైతుభరోసా కేవ లం 2 ఎకరాలకే అందించారు. ఇప్పుడు మరో సీజన్ వచ్చిం ది. వానాకాలానికి పెట్టుబడి సాయం అందుతుందో? లేదో? రైతులకు అర్థం కావడం లేదు. సాగు సమయంలో ప్రభు త్వం ఇచ్చే నగదుతో ఖర్చులకు ఆసరా అవుతుందని చిన్న, సన్నకారు రైతులు ఆశిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతులను నిలువునా మోసం చేస్తోంది. భారీ ప్రకటనలు చేస్తూ గందరగోళంలో పడేసి సరికొత్త రాజకీయాలకు తెర లేపుతున్నారు.
రైతులకు లాభం చేయకున్నప్పటికీ ఎంతో చేసినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండటంపై కర్షకులు మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎంతో మేలు జరిగిందని ప్రతి గ్రామం లో ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేక పదే పదే కేసీఆర్‌పై విధ్వేషపూరితంగా మాట్లాడే ముఖ్యమంత్రికి రైతుల బాధలు తెలియడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ పాలన వల్ల కర్షకులకు కన్నీళ్లు మిగిలాయని రోదిస్తున్నారు. వానాకాలంలో సమయానికి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక సీజన్‌కు ఎకరానికి రూ.7500 చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తగిన గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.
ఎకరం నుంచి రెండెకరాల వరకే రైతు భరోసా డబ్బులు అందిస్తే ఏం చేయాలో అర్థం కావడంలేదు. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు అందిస్తామని చెప్పి న సీఎం రేవంత్ రెడ్డి రూ.12వేలకు తగ్గించారు. అది కూడాసకాలంలో ఇవ్వడం లేదు. అప్పులు చేసి పంటలను సాగు చేసుకుంటున్నాం.
-షేక్ మోసిన్, రైతు, నస్రుల్లాబాద్
కేసీఆర్ హయాంలో రైతుబంధు డ బ్బులు అదనుకు వచ్చేవి. వానాకా లం, ఎండాకాలం రెండు పంటలకు సమయానికి ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేసేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా రైతు భరోసా ఎప్పుడు వస్తదో అని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా రెండు, మూడు విడుతల్లో వేస్తే అవి దేనికీ ఉపయోగపడవు. కాంగ్రెస్ వచ్చినంకా రైతులకు కష్టాలు తప్పడం లేదు.
-గొడిసెల నర్సింహులు గౌడ్, రైతు, నస్రుల్లాబాద్