హైదరాబాద్ : రాష్ట్రంలో వానలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో పలు జిల్లాల్లో జనం అవస్థలు పడుతున్నారు. తాజాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని చెప్పింది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతున్నది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉన్నది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ్టి ఉదయం వరకు నిర్మల్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 11 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వాన కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయని టీఎస్డీపీఎస్ వివరించింది.