ఇండోర్ : ఈ నెల 15న ప్రముఖ టీవీ నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించగా.. అందులో రాహుల్ నవ్లానీ తనను వేధిస్తున్నాడని, తన మృతికి కారణం అతడేనని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోనివ్వకుండా వేధిస్తున్నాడని నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు ఇండోర్లో రాహుల్ నవ్లానీని అరెస్టు చేశారు. నటి సూసైడ్ నోట్ ఆధారంగా పొరుగున ఉన్న రాహుల్ నవ్లానీ, అతని భార్య దిశాపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. వైశాలి ఆత్మహత్య తర్వాత పరారైన రాహుల్ నవ్లానీని అదుపులోకి తీసుకున్నారు.
వైశాలి పెళ్లి జరుగకుండా రాహుల్ నవ్లానీ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు ముందు సైతం ఫొటోలు, వీడియోలు చూపించి కాబోయే భర్తకు పంపాడని, ఆ తర్వాత నిశ్చితార్థం రద్దయ్యిందని.. మరొకరితో వివాహం చేసేందుకు ప్రయత్నం చేయగా అదే ట్రిక్స్ ప్లే చేశాడని కుటుంబీకులు పేర్కొన్నారు. వైశాలి టక్కర్ ‘ససురాల్ సిమర్ కా’ టీవీలో అంజలి భరద్వాజ్, ‘సూపర్ సిస్టర్’లో శివానీ శర్మ, ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో సంజన, ‘యే హై ఆషికి’లో బృందంగా నటించి.. అభిమానులను సంపాదించుకున్నది.