న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏండ్లకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పలు ప్రతిపక్ష పార్టీల సభ్యుల నిరసనల మధ్యనే కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్యవివాహాల నియంత్రణ(సవరణ) బిల్లు-2021ను సభ ముందుంచారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో బిల్లును పార్లమెంటరీ ప్యానల్‌కు పంపించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా ఇరానీ మాట్లాడుతూ వివాహాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలను ఇది భర్తీ చేస్తుందన్నారు. సమగ్ర పరిశీలన కోసం బిల్లును ప్యానెల్‌కు పంపుతున్నట్టు తెలిపారు. సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం హడావుడిగా ఈ బిల్లు తీసుకొస్తున్నదని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన ఎన్నికల చట్టాల(సవరణ)-2021 బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమో దించింది. కాగా, బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని, డివిజన్ ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అందుకు చైర్పర్సన్ ఆమోదించ కపోవడంతో నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, వామపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు. బిల్లు అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ విమర్శించారు. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల మాదిరిగానే ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నారని టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ అన్నారు. ఈ బిల్లు ఓటర్ల గోప్యత హక్కును ఉల్లంఘించేలా, సుప్రీంకోర్టు గత తీర్పునకు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బిల్లు ద్వారా బోగస్ ఓటర్లకు చెక్ పడుతుందని కేంద్ర మంత్రి కిరణ్‌రిజుజు చెప్పారు.