గంగాధర, ఏప్రిల్ 4: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. పదోతరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి వి ద్యార్థులను శుక్రవారం రాత్రి చితకబాదారు. ఈ ఘటన బయటికి పొకకుండా టీచర్లు తొక్కిపెట్టేందుకు యత్నించడంపై తల్లిదండ్రు ల్లో ఆగ్రహం వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమకు గౌరవం ఇవ్వడం లేదని పదోతరగతి విద్యార్థులు కోపం పెంచుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 35 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులపై 20మంది టెన్త్ విద్యార్థులు చితకబాదారు. రాత్రి 11 గంటల నుం చి తెల్లవారుజాము మూడు గంటల వరకు కొడుతూనే ఉన్నారు. ఇందులో 11 మందికి గాయాలు కాగా, దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి గోడదూకి పకనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తాడు. ఈ ఘటనను నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు రమేశ్, నైట్ వాచ్మెన్ శంకర్ పట్టించుకోలేదని విద్యార్థులు కన్నీరుపెట్టుకున్నారు. తమను ఇంటికి పంపించాలని, ఇకడే ఉంటే మళ్లీ కొడతారంటూ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
శనివారం ఉదయం స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఘటన గురించి చెప్పినా పట్టించుకోలేదని బాధిత విద్యార్థులు ఆరోపించారు. దాడిచేసినవారిని కనీసం మందలించలేదని, తమ పేరెంట్స్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా ఘటనను తొకి పెట్టేందుకు టీచర్లు ప్రయత్నించారని ఆరోపించారు. గాయపడిన వారిని కనీసం దవాఖానకు తీసుకెళ్లలేదని కన్నీరు పెట్టుకున్నారు. కాగా తహసీల్దార్ రజిత, ఎంఈవో ప్రభాకర్‌రావు, ఎంపీవో ప్రత్యూష, ఏఎస్సై లచ్చయ్య విచారణ జరిపారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థుల, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని తహసీల్దార్ తెలిపారు.
విషయం తెలుసుకొని శనివారం ఉదయం పాఠశాల వద్దకు వచ్చిన తమను లోపలికి రాకుండా సిబ్బంది గేటుకు తాళం వేసి అడ్డుకున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము లేకుండా పోలీసులతో రహస్య విచారణ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలు గాయపడి ఏడుస్తుంటే తమను లోపలికి రావద్దని చెప్పడానికి ఆర్సీవో ఎవరంటూ నిలదీశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వ హించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.