అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘డెకాయిట్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల కలబోతగా ట్రైలర్ మెప్పించింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశల్ని పెట్టుకున్న ప్రేమజంట హరి-జూలియట్ల జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ట్రైలర్ ఉత్కంఠను పంచింది. జైలు నుంచి తప్పించుకున్న హరి పోలీసులతో సాగించే పోరాటం, కొన్నేళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న ప్రేమ జంట తాలూకు సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. హరి, జూలియట్ పాత్రల్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.