హైదరాబాద్/ సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో పబ్‌తోపాటు 24 గంటల 2బీ బార్ లైసెన్స్‌ను ఎక్సైజ్‌శాఖ సోమవారం రద్దు చేసింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లో డ్రగ్స్ లభించిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు పబ్, బార్ లైసెన్సును ఎక్సైజ్‌శాఖ అధికారులు రద్దుచేశారు. డ్రగ్స్హ్రిత తెలంగాణ రాష్ర్టాన్ని నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మరోసారి అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. పబ్‌లలో డ్రగ్స్ వినియోగించకుండా యాజమానులే బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని గతంలోనే (జనవరి 31న) హెచ్చరించినట్టు గుర్తుచేశారు. యజమానులు ఎంతటివారైనా నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇకపై అన్ని పబ్‌లు, బార్లపై నిరంతరం దాడులు కొనసాగించాలని, ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరిం చారు. అంతకుముందు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ ఎక్కడి నుంచి నగరానికి వస్తున్నాయనే దానిపై నిఘా పెట్టామన్నారు. ఏ పబ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారో చెప్తే రైడ్ చేస్తామని బండి సం జయ్‌కు సవాల్ విసిరారు. ఇలాంటి ఘటనలను రాజకీయా లకు ఆపాదించడం సరికాదని హితవుపలికారు.
మరోవైపు ర్యాడిసన్ పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే అం శంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున డెకాయి ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మేనేజర్ అనిల్‌కుమార్, నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేనిపై కేసు నమోదు చేశారు. అభిషేక్, అనిల్‌కుమార్‌ను అరెస్టు చేయగా, అర్జున్ పరారీలో ఉన్నాడు. అభిషేక్, అర్జున్‌లకు పబ్బు లీజ్‌ను ఇచ్చిన కిరణ్‌రాజు అనే వ్యక్తిని సోమవారం ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. కిరణ్‌రాజు ర్యాడిసన్ నుంచి లీజ్‌కు తీసుకొని, గత ఆగస్టులో అభిషేక్, అర్జున్‌లకు సబ్‌లీజ్‌కు ఇచ్చినట్టు తేలింది. దాడి సందర్భంగా మేనేజర్ డెస్క్ వద్ద ప్లాస్టిక్ ట్రేలలో జూస్లు, ఇతర పానీయాలు తాగేందుకు ఉపయోగించే స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్తోపాటు ఐదు ప్యాకెట్లలో 4.64 గ్రాముల కొకైన్, 216 సిగరెట్ పీకలు లభించాయి. అధికారులు వాటిని సీజ్ చేశారు. మేనేజర్‌తోపాటు పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల్‌ను సోమవారం కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం నిందితులను తమకు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగాల్సి ఉన్నది.
కొకైన్ డ్రగ్‌ను ఎక్కువగా నైజీరియా, అఫ్రికా దేశస్థులే స్మగ్లిం గ్ చేస్తుంటారు. పుడ్డింగ్ పబ్‌కు కూడా అదే నెట్వర్క్ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్వింగ్ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) ఉన్నది. నెల క్రితం నైజీరియాకు చెందిన టోనీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. టోనీకి పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు అప్పట్లోనే గుర్తించారు. డ్రగ్ పెడ్లర్లు వాట్సాప్, ఇంటర్నెట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో అరెస్టయిన వారి సెల్ఫోన్లను పోలీసు లు విశ్లేషించడం వల్ల నెట్వర్క్ బయటపడనున్నది. మరోవైపు పబ్బులో లభించిన 216 సిగరెట్ల పీకల్లో గంజాయి, ఇతర డ్రగ్స్ ఏమైనా కలిపి ఉన్నాయా అనే విషయాలను కూడా పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా రాబట్టనున్నారు. పబ్బులో సుగంధ ద్రవ్యాల పౌడర్లు పైన వీటిని ట్రేలో పెట్టారు. వాటి కింద డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి.. పబ్బుకు వచ్చేవారిలో రెగ్యులర్ కస్టమర్లు, కోడ్ భాషను ఉపయోగించే వాళ్లకే ఈ డ్రగ్స్‌ను అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
కోదాడ టౌన్, ఏప్రిల్ 4: చెడు అలవాట్లు వద్దు, మంచిగా చదువుకో అని కొడుక్కి ఆ తల్లి సుద్దులు చెప్పింది. నీ కోసమే బతుకుతున్నా, ఎంత చదివితే అంత చదివిస్తా అని బతిమిలాడింది. అయినా అతను వినకుండా గంజాయి మత్తులో ఊగుతున్నాడు. తన కొడుకు చేతికి రాకుండా పోతాడేమోనని ఆవేదనతో సక్రమ మార్గంలో పెట్టేందుకు శిక్షించింది. వక్రమార్గం పడుతున్న కొడుక్కి బుద్ధివచ్చేలా కండ్లల్లో కారం పెట్టి దండించింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 35వ వార్డుకు చెందిన నిరుపేద దంపతులకు 16 ఏండ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు స్థానికంగా చదువుకొంటూ అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అతడు గంజాయికి బానిసయ్యాడు. మూడు నెలలుగా అతనిలో మార్పును గమనించిన తల్లిదండ్రులు మందలించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయినా వినకుండా గంజాయి సేవిస్తూ ఇటీవల 15 రోజులపాటు ఇంటికి రాలేదు. సోమవారం ఇంటికొచ్చిన కొడుకుపై ఆగ్రహించిన తల్లి స్తంభానికి కట్టేసి, కంట్లో కారంపెట్టి కొట్టింది. కాగా, కొడుక్కి తల్లి బుద్ధి చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.