‘సత్య, సౌందర్యాల రసవత్ సమ్మేళనమే కళ’ అన్నారు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతి వ్యక్తిలోనూ చిన్ననాటి నుంచే కళలను పాదుకొల్పాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తద్వారా మనిషిలో మనిషితనం వెల్లివిరుస్తుందని ఆయన ఉద్బోధించారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం.. ‘రాను రానూ మనిషి ఎందుకింత క్రూరుడు అవుతున్నాడు? సాటి మనిషిని చంపే యుద్ధాలకు, హింసకు ఎందుకు తెగబడుతున్నాడు?’ అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పుడు అమెరికన్ కవి, మేధావి టి.ఎస్.ఇలియట్ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ఎప్పుడైతే మనం మన విద్యాబోధనను ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ (కళలు-మానవీయ విద్య), సైన్స్ అండ్ టెక్నాలజీలను విడదీసి బోధించడం ప్రారంభించామో అప్పటినుంచే మానవజాతి పతనం ప్రారంభమైంది’ అన్నాడు. సామాజిక, ప్రాపంచిక దృష్టి కొరవడటం వల్లే వ్యక్తిగత అభివృద్ధి (కెరీర్) వైపు పరుగెత్తుతున్నారని పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని గుర్తించే నాసా, ఎంఐటీ వంటి ప్రసిద్ధ సంస్థలు రంగస్థల విద్య (థియేటర్ ఎడ్యుకేషన్)కూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. రంగస్థల మాధ్యమం ద్వారా విద్యాబోధన (ఎడ్యుకేషన్ త్రూ థియేటర్)కు పెద్దపీట వేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం) సక్రమంగా పనిచేసేలా చక్కటి తర్ఫీదును ఇస్తున్నాయి. విద్యతోపాటు వివేకాన్ని, ఆత్మైస్థెర్యాన్ని, సృజనశీలతను పెంచేలా కృషి చేస్తున్నాయి. కోదాడలోని ‘తేజ విద్యాలయం’ తన వార్షికోత్సవాన్ని మార్చి 22న ఆ విధంగా నిర్వహించి మన విద్యా వ్యవస్థకు మార్గదర్శిగా నిలిచింది. తేజ విద్యాలయం విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని పాఠాలనే ఇతివృత్తాలుగా చేసుకుని, చిన్నచిన్న స్కిట్స్‌గా రూపొందించుకుని, పాత్ర విభజన చేసుకుని ప్రదర్శించారు. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకు పిల్లలందరూ ఏదో ఒక కళారూపంలో పాల్గొనేలా చేయడంలో ఉపాధ్యాయులు కృతకృత్యులయ్యారు. ‘రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు బాధితులకు ఎలా సహాయపడాలి’ అనే విషయాన్ని ‘హెల్పింగ్ నేచర్’ స్కిట్ చూపెట్టింది.
పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాల్సిన పిల్లలను చదువు పేరుతో పంజరంలో బంధించడం సరికాదని ‘నాట్ ఇన్ ఎ కేజ్’ స్కిట్ చూపింది. జ్ఞానేంద్రియాల శక్తిని, విశిష్టతను ఒక స్కిట్ తెలిపితే, ఇచ్చిపుచ్చుకోవడంలోని సంతోషాన్ని మరో స్కిట్ ఎరుకజేసింది. ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఒకే తీరుగా ఉండకపోవచ్చు. భిన్నరీతుల్లో ఆలోచించమని మరో స్కిట్ ప్రేక్షకులకు నేర్పింది. నీటిని పొదుపుగా వాడుకుని, మొక్కలు, చెట్లు, అడవులను కాపాడుకుంటేనే పర్యావరణాన్ని రక్షించుకోగలమని మరో స్కిట్ పెద్దలకు హితవు చెప్పింది. ఆడపిల్లలు, మగపిల్లల పట్ల ఇంటా బయటా ఎలాంటి వివక్ష చూపరాదని ప్రదర్శించిన స్కిట్ లింగ సమానత్వాన్ని చాటింది. జంక్ ఫుడ్ కంటే అమ్మ వంటే మంచిదంటూ… అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ వంట చేయవచ్చని మరో స్కిట్ సున్నితంగా హెచ్చరిస్తుంది. అలాగే లెక్కలు అంటే భయం పోయేలా జీవితంలో గణితశాస్త్రం అవసరాన్ని మరో స్కిట్ తెలియజేసింది.
తెలుగు పాఠాల్లోని ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘సీతమ్మ కష్టాలు’ బుర్రకథ. ‘బుద్ధి తెచ్చుకున్న కోతి’ మొదలైనవీ ప్రదర్శించారు. పాఠ్యాంశాన్ని రూపకంగా మలచుకొని, పాత్రల్లో పిల్లలు అభినయిస్తున్నప్పుడు పలికే ముద్దుముద్దు మాటలు, చేష్టలు పెద్దలను అలరించాయి. పిల్లల నటన, వారి సందేశాలు పెద్దలతో ‘ఔరా!’ అనిపించాయి. ఈ రూపకాలన్నిటికీ మేకప్, క్రాఫ్ట్ వర్క్, సంగీతం పిల్లలే సమకూర్చుకున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఐకమత్యంగా ఉన్నారు. ఉపాధ్యాయులు పర్యవేక్షక బాధ్యత మాత్రమే నిర్వర్తించారు.
ఈ ప్రదర్శనల వల్ల ‘మా పిల్లల్లో స్టేజ్ ఫియర్ పోయింది. ఆత్మైస్థెర్యం పెరిగింది. చక్కటి ఉచ్చారణతో భాషా నైపుణ్యాలు అలవడ్డాయి’ అని ఉపాధ్యాయులే కాదు తల్లిదండ్రులూ పేర్కొన్నారు. వార్షికోత్సవాల్లో చదువుకు సంబంధం లేని రికార్డింగ్ పాటలతో డ్యాన్స్‌లు వేయించడం కన్నా.. ఇలాంటివి చేయించడం వల్ల పిల్లలకు, సమాజానికి ఎంతో ఉపయోగమని అందరూ ప్రశంసించారు. ఇది కదా నిజమైన చదువు! అదే కదా సజీవ రంగస్థల మాధ్యమం గొప్పతనం!