‘మీరా కార్ల్లు నడిపేది?’, ‘మీకు రేసింగ్ బండ్లు కావాలా?’ ..తదితర పురుషాధిక్య భావజాలంతో విసిగిపోయారు. ఆ మూసను బద్దలుకొడుతూ.. జెట్ స్పీడ్ సూపర్ కార్లలో దూసుకెళ్తున్నారు ఢిల్లీలోని ‘క్వీన్స్ డ్రైవ్ క్లబ్’ సభ్యులు.
ఆమెకు కార్లంటే ఇష్టం. ఓ ఖరీదైన సూపర్ లగ్జరీ కారు కొనుగోలు చేశారు కూడా. ఉత్సాహంగా
‘సూపర్ కార్ ఓనర్స్ క్లబ్’లో చేరేందుకూ వెళ్లారు. కానీ తీవ్ర నిరాశ ఎదురైంది. కారణం, మహిళ అనే
ఒకే ఒక్క కారణంతో సభ్యత్వం ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ అవమానాన్ని భరించలేక మహిళల కోసం ఢిల్లీలో ‘క్వీన్స్ డ్రైవ్ క్లబ్’ పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేశారు రితికా జతిన్ అహూజా.
గత ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు 30 మంది సూపర్ లగ్జరీ, స్పోర్ట్స్, అల్ట్రా లగ్జరీ కార్లు, సూపర్ బైక్లు కలిగిన మహిళలతో ఓ ఈవెంట్ నిర్వహించారు అహూజా. వచ్చే ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఓ వేడుక ప్లాన్ చేశారు. ఆ తర్వాత గ్లోబల్ ఈవెంట్ ఘనంగా జరపాలని ఆలోచన. ఇప్పటికే ఈ క్లబ్లో 58 మంది సభ్యులున్నారు.వీళ్లంతా స్టీరింగ్ తిప్పడంలో పురుషులకు సవాలు విసురుతున్నారు.