మాస్కో, జూన్ 23: ఎన్నో దశాబ్దాలుగా ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉన్న రష్యా కీలకమైన ప్రస్తుత దశలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నది. ఇరాన్‌పై అమెరికా దాడి విషయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయిస్తారని వార్తలు వెలువడినప్పుడు.. రష్యా స్పందిస్తూ.. ఇరాన్‌పై సైనిక చర్యకు పాల్పడరాదని వాషింగ్టన్‌ను హెచ్చరించింది. అమెరికా చర్య అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చని, అనూహ్యమైన ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. రెండు అగ్రరాజ్యాలు తలపడితే పరిణామాలు భీకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు.
దాడి విషయంలో రెండు వారాల్లో నిర్ణయించుకుంటామన్న ట్రంప్ రెండు రోజుల్లోనే ఇరాన్ అణు కేంద్రాలపై భీకర దాడులకు దిగారు. కానీ రష్యా నుంచి ఇరాన్‌కు అనుకూలంగా ఎటువంటి స్పందన కానరాలేదు. పైగా తాము ఈ పోరులో తటస్థంగా ఉంటున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పుతిన్ మాట్లాడుతూ.. మాజీ సోవియట్ యూనియన్, ప్రస్తుత రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దాదాపు రష్యన్ భాష మాట్లాడే దేశంగా మారిపోయిందని అన్నారు. వర్తమాన చరిత్రలో ఈ అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించారు.