IPL | ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ వేలానికి ముందు ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్రక్రియతో సతమతం అవుతుంటే సోషల్ మీడియాలో పలువురు ఆకతాయిలు చేస్తున్న పోస్టులపై క్రికెటర్లు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లోకి వస్తున్నాడంటూ ‘ఎక్స్’లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై స్వయంగా అతడే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఎక్స్‌లో ఓ యూజర్.. ‘పంత్ తన మేనేజర్ ద్వారా ఆర్సీబీ యాజమాన్యాన్ని సంప్రదించాడు. ఆ జట్టులో సారథి పోస్టును పంత్ కోరగా అందుకు ఆర్సీబీ నిరాకరించింది. పంత్ ఆర్సీబీలోకి రావడం కోహ్లీకి ఇష్టం లేదు’ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై పంత్ స్పందిస్తూ.. ‘ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో మీరు ఇంత దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వార్తలను సృష్టించవద్దు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు అంతేగాక ఇదే చివరిసారీ కాబోదు కానీ ఇన్నాళ్లూ దీనిపై చూసీ చూడనట్టు వ్యవహరించా. కానీ నానాటికీ పరిస్థితి దిగజారిపోతోంది. దయచేసి ఇలాంటివి రాసేముందు సంబంధిత వర్గాల నుంచి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఇక మీ ఇష్టం’ అని ఘాటుగా రిైప్లె ఇచ్చాడు.