నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 25: పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. ఈ నెల 27న గ్రామాలు, పట్టణాల్లో పోలియో చుక్కలు వేస్తారు. మొదటి రోజు వేసుకోని వారికి 28న పోలియో చుక్కలు వేస్తారు. మార్చి ఒకటిన వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేస్తారు.
పోలియోను విజయవంతం చేద్దాం
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 25: ఈ నెల 27న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి పల్స్ పోలియోపై నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జాతీయ పల్స్ పోలియో నిర్మూలనలో భాగంగా 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ అందించాలని సిబ్బందికి సూచించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ వేసేలా వైద్య సిబ్బంది ఇతర శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. జిల్లాలో 90,419 మంది పిల్లలకు టీకా వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం 645 పోలింగ్ కేంద్రాలు, 5వేల టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బస్టాండ్లు, జనసంచార ప్రదేశాల్లో టీకాలు వేయాలని సూచించారు. అనంతరంపల్స్పోలియో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీపీవో వెంకటేశ్వర్లు, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్టీవో అజయ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఈఈ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు.
వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
పల్స్‌పోలియో విజయవంతం చేసేందుకు జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలోఅన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి శిక్షణ కల్పించాం. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. మొదటి రోజు వేసుకోని వారికి రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.
-డా. ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో, నిర్మల్