హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, సూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లలో రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటి నారొటిక్స్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఏఎన్బీ ఎస్పీ రూపేశ్, తదితరులు పాల్గొన్నారు.