గద్వాల అర్బన్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ( Public health) అందించే విధంగా అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని ఆరోగ్యశ్రీ సీఈవోఉదయ్ కుమార్ ( Arogyasri CEO Uday kumar ) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి సందర్శించారు. అనంతరం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి విభాగం మెరుగైన పనితీరు చూపేలా అంకితభావంతో విధులను నిర్వహించాలని, జిల్లా వైద్య సంస్థలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలన్నారు.
జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న ఆధునిక వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు అందించే సేవలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరా, టీఎస్ఎంఐ డీసీ శ్రీనివాసులు, హెచ్వోడీలు , వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.