ఇంద్రవెల్లి, డిసెంబర్ 9 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గోపాల్పూర్, గోపాల్పూర్ గూడ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉంటామని నిర్ణయించారు. మంగళవారం గ్రామానికి కొద్దిదూరంలో ఉన్న వాగు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతోపాటు గ్రామంలో మౌళిక సదుపాయలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ల ఎన్నికలతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ గ్రామానికి వచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించి మోసం చేసి మా ఓట్లతో గెలిచిన తరువాత తమ గ్రామానికి ఎవరు కూడా రాకుండా పట్టించుకోవడం లేదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని అన్నారు.
తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ప్రతి సంవత్సరం గ్రామస్తులు కలిసి శ్రమదానంతో మట్టిరోడ్డుకు బాగు చేస్తామని, గ్రామంలో తాగునీటి సౌకర్యం లేవని, సీసీరోడ్లు, మురుగు కాలువలు లేకపోవడంతో గ్రామంలో వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుందని ఆరోపించారు. ఎవరికి ఓటు వేసిన ఫలితం లేదని, దీంతో ఈ సర్పంచ్ ఎన్నికలకు రెండు గ్రామాల ప్రజలు దూరంగా ఉండానికి నిర్ణయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం ఇంద్రు, మెస్రం వినాయక్రావ్, మాల్కన్నాయక్, జీజాబాయి, మెస్రం రాంభాబాయి, కచ్కాడ్ దశరథ్, మెస్రం మాంజీరావ్, నాగోరావ్ పాల్గొన్నారు.