యాచారం, జూన్ 29 : భూ సమస్య పరిష్కారం కోసం ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందిన ఓ రైతు సోమవారం వినూత్న నిరసనకు దిగాడు. యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు నేరుగా నాగలి కట్టిన కాడెద్దులతో వచ్చి ధర్నా చేశారు. ఈ ఘటన మండలంలో హట్ టాపిక్‌గా నిలిచింది. రైతు ధర్నాకు పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు, రైతులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు రైతుకు నచ్చ జెప్పాలని చూసి నా అతను ససేమిరా అన్నాడు. దీంతో కొద్ది సేపు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మండలంలోని మొగుళ్లవంపు గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి అనే రైతుకు అతడి అన్నదమ్ములతో కలిసి సర్వేనంబర్ 98లో 16 ఎకరాల 20 గుంటల భూ మి ఉన్నది.
ఇందులో 1985లో 8 ఎకరాలు, 1993లో 4ఎకరాలు విక్రయించగా 4 ఎకరాల 29 గుంటల భూమి ఉన్నది. ఆ మిగులు భూమిలో తన సోదరులు అమ్ముకోగా తనకు 3ఎకరాల భూమి రావాలని..నా పేరున ఉన్న 3 ఎకరాల భూమిని సర్వేచేసి ఆన్లైన్లో ఎక్కించి నూతన పాస్‌బుక్ ఇవ్వాలని కోరాడు. ఈ సమస్యను పరిష్కరించాలని గత 15 ఏండ్లుగా యాచారం తహసీల్దార్ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అయ్యప్ప అక్కడికి వచ్చి రైతుతో మాట్లాడారు. ఆ సమస్య తన దృష్టికి రాలేదని లిఖితపూర్వకంగా రాసిస్తే క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతు నిరసన విరమించాడు.