మునుగోడు, ఏప్రిల్ 01 : ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిది అని అటవీ శాఖ డివిజనల్ నల్లగొండ అధికారి వై.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న ధరిత్రి దినోత్సవం పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం నిర్వహించే సదస్సు కరపత్రాన్ని మునుగోడు అటవీ ఆఫీస్ యందు తమ చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూమిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అదేవిధంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాలుష్య కారకాలను వాడకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ మాట్లాడుతూ.. ధరిత్రి దినోత్సవం ప్రతి ఒక్కరు విధిగా జరుపుకుని విరివిరిగా మొక్కలు నాటి భూమిని కాపాడాల్సిన బాధ్యత మానవాళిపై ఉందన్నారు.
నల్లగొండలో జరిగే ధరిత్రి సదస్సును ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట నరసింహా చారి, మునుగోడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎండీ అఫీస్ ఖాన్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎస్.సుచరిత, డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.రాములు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి బి.అఖిలేష్, ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జిట్టగోని వెంకటేశం, సామాజిక ఉద్యమ నాయకులు గుర్రాల పరమేష్, పందుల భిక్షం, జర్నలిస్టు నాయకులు ఐతరాజు సత్యం, ఉదయ్, లావణ్య, చందన, ప్రవీణ్ పాల్గొన్నారు.