గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల వినియోగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఇప్పుడు అంతటా సర్వసాధారణమైపోయింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే.. మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ కావడం ఖాయం. ముఖ్యంగా పిన్ నంబర్, పాస్వర్డ్, ఫ్రాడ్ కాల్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పిన్ నంబర్ రహస్యం: స్నేహితులు, బంధువులు, చివరకు కుటుంబ సభ్యులైనాసరే.. పిన్ నంబర్ విషయంలో గోప్యతను పాటించండి. పిన్ నంబర్ ఇతరులకు తెలిస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మిత్రులకో, బంధువులకో చెప్పాల్సి వచ్చినా.. ఆ వెంటనే దాన్ని మళ్లీ మార్చేయండి.
పాస్వర్డ్: పాస్వర్డ్ కోసం ఇంటిపేరు, పుట్టినరోజు, కుటుంబ సభ్యుల పేర్లు, దగ్గరి వాళ్ల నిక్ నేమ్స్.. ఇలాంటివి అస్సలు ఉపయోగించకండి. మీ పాస్వర్డ్.. అంకెలతోనూ, స్పెషల్ క్యారెక్టర్లతోనూ, కనీసం ఒక క్యాపిటల్ లెటర్తోనైనా ఉండేలా చూసుకోవడం మంచిదని మరువరాదు.
స్పామ్ మెసెజ్‌లు: కొత్తకొత్త ఆఫర్లు, లాటరీ, లోన్లు ఇలా అనేక మెసేజ్‌లు వెబ్ లింక్‌లతో వస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే మన అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదాలు చాలా ఎక్కువ. అలాగే ఈ-మెయిల్‌కు వచ్చే మెసేజ్‌లనూ క్లిక్ చేయకండి.
ఒక్కటే యాప్: యూపీఐ పేమెంట్ల కోసం ఏదో ఒక యాప్‌నే వినియోగించండి. అనేక యాప్‌లను ఉపయోగించడం వల్ల కూడా దొంగలకు దొరకడం చాలా తేలిక. రిటైల్ దుకాణదారులు, చిరు వ్యాపారులు అధికంగా వినియోగిస్తున్న యాప్‌నే ఎంచుకోండి. దీనివల్ల మీ బ్యాంకింగ్ లావాదేవీల పద్దు కూడా చిన్నగా ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా మీ యూపీఐ యాప్‌ను తరచుగా అప్డేట్ చేస్తూ ఉండండి. దీనివల్ల మెరుగైన ఫీచర్లు, ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.