
సిటీబ్యూరో, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ) : “ఆ బాలికలు స్కూల్కు వెళ్లాలంటే ఏడు కిలో మీటర్లు నడవాలి. ఇంటికి రావాలంటే మళ్లీ ఏడు కిలో మీటర్లు నడవాలి. చదువుకోవాలంటే రోజుకు14 కిలో మీటర్లు నడవాల్సిన పరిస్థితి. అయినా చదవు ఆపకుండా ఆ బాలికలు కాలినడకనే ప్రతీరోజు స్కూల్కు వెళుతున్నారు.” ఇది సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం చింతల చెరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల పరిస్థితి. ఆ చిన్నారుల ఇబ్బందులను తెలుసుకున్న హైదరాబాద్ సైక్లిస్టులు ఆ బాలికలకు సైకిళ్లు అందించడానికి ప్రాజెక్టు దియా పేరుతో ఓల్డ్ సైకిళ్ల సేకరణ ప్రారంభించారు. మొత్తం 37 మంది బాలికలకు సైకిళ్లు అవసరం పడటంతో సోషల్ మీడియా వేదికగా నెల రోజులుగా వారు చేసిన ప్రయత్నం సఫలమయింది. నగరవాసులు మొత్తంగా 37 సైకిళ్లు సమకూర్చారు. వాటిని తొందరలోనే ఆ బాలికలకు అందించడానికి సైక్లిస్టులు సిద్ధమయ్యారు. ఇంకా ఎవరైనా సైకిళ్లను అందించాలనుకుంటే 9629557866 నెంబర్ను సంప్రదించాలని కోరారు.