సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఒక ఐటీ ఉద్యోగి ఇంటి నుంచి ఆఫీసు వచ్చే వరకు అవసరమైన ఏర్పాట్లను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రస్తుతం, ఐటీ కారిడార్‌లో ప్రైవేటు వాహనాలకు తోడు ఐటీ కంపెనీలు హైర్ చేసుకున్న కార్లు అధికంగా ఉండటంతో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. ఇదే విషయమై ఐటీ కంపెనీల ఫెసిలిటీ మేనేజర్లతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో చర్చించింది.
హైదరాబాద్‌లో ఐటీ రంగం దినదినం అభివృద్ధి చెందుతుండటంతో లక్షలాది మంది ఉద్యోగ రిత్యా నగర నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌లోని కంపెనీలకే వచ్చి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది వాహనాలు ఐటీ కారిడార్‌కు వచ్చి వెళ్తున్నాయి. కాగా, ఐటీ కారిడార్‌కు మెట్రో సౌకర్యం ఉండటంతో కొందరు ఐటీ ఉద్యోగులు మెట్రోలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా, ఐటీ కారిడార్లలో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ గణనీయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కార్లకు బదులుగా ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు వీలుండే బస్సులను ఐటీ కంపెనీల నుంచి నడపడం ద్వారా కొంత మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే విషయాన్ని ఇటీవలే ఐటీ కంపెనీలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
ఐటీ కంపెనీలతో చర్చించేందుకు …
ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వడంపై ఆర్టీసీ సంస్థ పరంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ఎం.డి సజ్జనార్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ తరపున ఐటీ కంపెనీలతో చర్చించేందుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఐటీ కంపెనీల ఫెసిలిటీ మేనేజర్లు తమకు ఎన్ని బస్సులు అవసరం ఉన్నది? ఏయే మార్గాల్లో నడపాలన్న విషయాలను నోడల్ అధికారులతో మాట్లాడి, ఆర్టీసీ బస్సులను హైర్ చేసుకోవచ్చని ఐటీ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఐటీ కారిడార్‌లోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, కోకాపేట ప్రాంతాల్లో సుమారు 1500లకు పైగా ఐటీ కంపెనీలు ఉండగా, అందులో 150 నుంచి 250 కంపెనీల్లో 10 వేల నుంచి మొదలు కొని 20 వేల మంది దాకా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలతో కలిసి మినీ బస్సులు, 5,7 సీట్లర్ కార్లను అద్దెకు తీసుకుంటున్నాయి. వీటికి బదులుగా ఆర్టీసీ బస్సులను ఐటీ కంపెనీ ప్రాంగణాల నుంచి నడిపితే కార్ల సంఖ్య తగ్గడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుందని ఓ ఐటీ కంపెనీ ఫెసిలిటీ మేనేజర్ తెలిపారు.
ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై సంయుక్త కార్యాచరణ
ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల భద్రతతో పాటు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీసులు, ఐటీ కంపెనీలతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పనిచేస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఉచితంగా షీ షెటిల్ పేరుతో ఐటీ కారిడార్లోనే తిరిగేలా ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. అయితే ఇవీ ఐటీ ఉద్యోగుల ప్రయాణ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడం లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించడం ద్వారా నగర నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులను ఐటీ కారిడార్‌కు నడిపేలా చర్యలు తీసుకుంటామని ఐటీ కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పోలీసులతో భద్రతా పరమైన అంశాలపై పనిచేస్తుండగా, ఇక నుంచి రవాణా వ్యవస్థలపైనా ప్రధానంగా దృష్టి సారిస్తామని, ఆర్టీసీతో కలిసి ప్రజా రవాణా వ్యవస్థ ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా చూస్తామని తెలిపారు.