మక్తల్ : నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం మక్తల్ మండలం కాట్రేవ్పల్లి గ్రామంలో భూములు ( Land Losing) కోల్పోతున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రైతులు ఎంపీ డీకే అరుణకు( MP DK Aruna ) వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు( Revenue Officials ) రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండానే భూసేకరణ సర్వేలు చేపడుతున్నారని ఆమెకు ఫిర్యాదు చేశారు.
భూ బాధితులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ చేపడుతున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కాట్రపల్లి గ్రామ శివారులో మిగిలి ఉన్న 90 నుంచి 100 ఎకరాల వరకు ప్రాజెక్టు నిర్మాణంలో రైతులు భూములు కోల్పోతున్నారని వివరించారు. తమతో సంప్రదించకుంటానే భూ సేకరణకు పూనుకోవడం విచారకరమని ఆరోపించారు. సర్వేలు చేపట్టి తప్పుల తడకలుగా నోటీసులను అందజేస్తున్నారని వెల్లడించారు.
గతంలోనూ భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామానికి చెందిన 300 ఎకరాల రైతులు భూమి కోల్పోయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న భూమిలో ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం భూసేకరణ చేపడితే గ్రామంలో రైతులకు ఏమాత్రం వ్యవసాయం చేసుకోవడానికి లేకుండా పోతుందని వాపోయారు. స్పందించిన ఎంపీ నారాయణపేట ఆర్డీవో రామచందర్కు సెల్ఫోన్లో మాట్లాడారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే, తదుపరి పనులను చేపట్టాలని ఎంపీ సూచించారు. ఎంపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో కాట్రేపల్లి గ్రామానికి చెందిన భూ బాధిత రైతులు కేశవులు, శ్రీనివాస్, రవికుమార్, జిలాని, రాజు, బాలయ్య, రాములు గౌడ్, అంజప్ప, నాగేష్, సాయి బన్న, రాములు, నారాయణతోపాటు తదితరులు ఉన్నారు.