హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెందిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంకావడంపై సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సచివాలయంలో ప్రకటించారు. సింగరేణిలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు బయటపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి రికార్డులు, ఫైల్స్‌లో నమోదైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు భౌతిక నిల్వల్లో లెక్కకు రాలేదని, ఈ బొగ్గును ఎవ రు మాయం చేశారని హరీశ్‌రావు ప్రశ్నించా రు. ఏడు గనుల వద్ద ఈ బొగ్గు ఉన్నట్టు రికార్డుల్లో ఉందని, కానీ ఆయా గనుల వద్ద బొగ్గు లాట్లు కనిపించడంలేదని ఆరోపించారు. ఈ బొగ్గుకు కోల్ సెస్, ఇన్కమ్ ట్యాక్స్, కట్టడమే కాకుండా, ఈ బొగ్గును లెక్కలోకి తీసుకొని లాభాల్లో వాటా కూడా ఇచ్చారని, డీఎంఎఫ్టీ, సీఎస్సార్ ఫండ్స్ కూడా కట్టారని ఆధారాలతో బయటపెట్టారు. హరీశ్‌రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.
సింగరేణి విషయంలో సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయి. కొంతకాలం క్రితం నైని టెండర్ల వ్యవహారం వివాదాస్పదమైంది. ఎట్టకేలకు ఈ టెండర్లను రద్దుచేయాల్సి వచ్చింది. ఈ విషయంలో సర్కార్ భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. సింగరేణిలో టెండర్ల ఖరారుకు సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడం కూడా వివాదానికి దారితీసింది. ఈ సర్టిఫికెట్ పేరిట నచ్చిన వారికే టెండర్లు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. సీఎం బామ్మర్ది జోక్యం పెరుగడంపైనా విమర్శలు గుప్పించింది. నైని టెండర్లు రద్దు, బొగ్గు కుంభకోణాలపై సాక్షాత్తు సర్కార్ కల్పించుకోవడం, విచారణకు ఆదేశించడం.. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలకు అద్దంపడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.