న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ కారణమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ దీటుగా స్పందించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలతో బిజీ అయ్యారని ఆమె విమర్శించారు. ముంబైలో కాంగ్రెస్, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాలు వలస కూలీలు తరలివెళ్లేందుకు ఉచిత టికెట్లు ఇవ్వడంతో పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రియాంక ఆక్షేపించారు.
కరోనా కల్లోలంలో ప్రధాని మోదీ పేదలను విస్మరించారని, ఇంటికి చేరే దిక్కులేక వలస కూలీలు కాలినడకన గమ్యస్ధానాలకు తిరుగుముఖం పట్టారని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఎవరూ సాయం చేయకూడదని మోదీ కోరుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. భారత్లో రోజుకు రెండు లక్షల కేసులు వెలుగుచూస్తున్న సమయంలో 2021 ఏప్రిల్లో ప్రధాని పశ్చిమ బెంగాల్ అసన్సోల్లో భారీ ప్రచారర్యాలీలో ప్రసంగించారని గుర్తుచేశారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ పనాజీలో పర్యటిస్తున్నారు. గోవాలో ఫిబ్రవరి 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
మరోవైపు తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ప్రధాని ప్రకటన పూర్తిగా వాస్తవ విరుద్ధమని, కరోనా సమయంలో కష్టనష్టాలు అనుభవించిన వారిపట్ల ప్రధాని సంయమనంతో వ్యవహరించాలని ప్రజల కడగండ్లపై రాజకీయాలు చేయడం ప్రధాని స్ధాయి వ్యక్తికి తగదని కేజ్రీవాల్ హితవు పలికారు.