ఇబ్రహీంపట్నం, జూన్ 16 : ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే పాటగా మారింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించొద్దని నిబంధనలున్నా అనేక పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ విక్రయిస్తున్నారు. ముఖ్యంగా శివారులోని ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట వంటి ప్రాంతాల్ల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నది. విస్తరిస్తున్న కాలనీలకు అనుగుణంగా కొత్త పాఠశాలలూ ఏర్ప డుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తామని చెబుతూ ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, డ్రెస్సులు, ట్రాన్స్‌పోర్టు పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.80,000-రూ.1,00,000 వరకు వసూళ్లు చేస్తున్నాయి. జిల్లాలో 1500లకు పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి.
ఈ బడుల్లో టాలెంట్, టెక్నో, యూటెక్నో, డీజీ, ఒలింపియా, ఐఐటీ, జేఈఈ, మోడల్‌స్కూళ్లు, కంప్యూటర్, స్పోర్ట్స్, డిజిటల్ వంటి ఆకర్షణీయమైన కోర్సుల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. కాగా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేకమంది తమ పిల్లలను చదివించేందుకు ఇబ్రహీంపట్నం, బొంగ్లూరు, తుర్కయాంజా ల్, రాగన్నగూడ, మన్నెగూడ, తుక్కుగూడ, చేవెళ్ల, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
ఇటీవల మన్నెగూడ, రాగన్నగూడ, బొంగ్లూరు, ఇబ్రహీంపట్నంలలో పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. తల్లిదండ్రుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని ఆయా పాఠశాలల యాజమాన్యాలు డొనేషన్లు, ఫీజులను పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి పదోతరగతి వరకు లక్షల రూపాయల్లో వసూళ్లు చేస్తున్నా రు. వీటికి తోడు ఇబ్రహీంపట్నం నుంచి మన్నెగూడ, రాగన్నగూడ, తుర్కయాంజాల్ బస్సుసౌకర్యం కోసం రూ. పది నుంచి రూ.ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు. వీటికితోడు డ్రెస్సులు, టైబెల్టులు, పాఠ్యపుస్తకాల పేరుతోనూ దోపిడీ చేస్తున్నారు.
వసతులు అంతంతే..
అనేక ప్రైవేట్ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోగా, అనుభవజ్ఞులైన ఉపాద్యాయులూ ఉండడంలేదు. ఒక్కో తరగతి గదిలో 60-80 మంది వరకు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. ఆటస్థలాలూ ఉండడంలేదు. అద్దెభవనాల్లో నిర్వహిస్తున్నారు. తక్కువ వేతనాలతో అనుభవం లేని టీచర్లతో బడులను కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమతి లేకుండా కూడా పలు ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఏటేటా పెరుగుతున్న ఫీజులను నియంత్రించటంలో అధికారులు విఫలమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎల్కేజీ నుంచి ఐదోతరగతి వరకు : రూ.50నుంచి రూ. లక్ష వరకు
రవాణా చార్జీల పేరుతో.. : రూ.15 నుంచి రూ.20వేలు
పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌కు : రూ.10 నుంచి రూ.20వేలు
డ్రెస్, టై, బెల్టులకు : రూ.5 నుంచి రూ.8 వేలు.
ఐదు నుంచి 10తరగతి వరకు : రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు
డొనేషన్ల పేరుతో : రూ.లక్షల్లో వసూళ్లు..
ప్రైవేట్ పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఫీజులు, డొనేషన్లు వసూళ్లు చేస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. తల్లిదండ్రులు ఒకరిని చూసి మరొకరు తమ పిల్లలను ప్రైవేఠ్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలలకు అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి. డొనేషన్లూ తగ్గించాలి. -రాజ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి