హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అన్నచందంగా మారింది. ప్రస్తుతం గురుకులాల్లో మాత్రమే అరకొరగా కామన్ డైట్ అమలవుతున్నది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదన్న సాకుతో కామన్ మెనూను పూర్తిగా పక్కన పెట్టారు. హాస్టల్స్‌కు తగిన మెనూను సిద్ధం చేయకుండా విద్యార్థుల పొట్టగొడుతూ కొందరు ఉన్నతాధికారులే ఆ నిధులను కైంకర్యం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని విద్యార్థి సంఘాలు, కులసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులందరికీ కామన్ డైట్ అమలు చేస్తామని నిరుడు అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో ఘోరంగా విఫలమైంది. కామన్ డైట్ అమలు కోసం ప్రభుత్వం టీజీ డైట్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. అందులో విద్యార్థుల సంఖ్యను ఎంట్రీ చేయగానే మెనూలో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఏ డైట్‌కు ఏ సరుకులు వాడాలి? ఎంత పరిమాణంలో వాడాలి? తదితర వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆ సాఫ్ట్వేర్ అందిస్తుంది. అందుకు తదనుగుణంగా సంబంధిత గురుకులాల ప్రిన్సిపాళ్లు మెనూ అమలు చేయాలి. కానీ, టీజీ డైట్ అప్లికేషన్‌ను ఇప్పటికీ 50% గురుకులాలు కూడా అమలు చేయడం లేదు.
విద్యార్థులు నిర్ణీత సంఖ్యలో ఉన్నప్పుడే కామన్ డైట్ అమలు సాధ్యమని ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే డైట్ ఖర్చులు అంత ఎక్కువగా పెరుగుతాయని, ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కేటాయించిన బడ్జెట్ సరిపోదని స్పష్టం చేస్తున్నారు. దీంతో దాదాపు 50 గురుకులాల్లో కామన్ డైట్ అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కామన్ డైట్ మొత్తానికే అమలు కావడం లేదు. ఒక్కో వసతి గృహంలో సగటున 100-150 మంది విద్యార్థులు లేకపోవడంతో కామన్ డైట్ అమలు అసాధ్యమని వార్డెన్లు ఇప్పటికే చేతులు ఎత్తేశారు. దీనిపై ఉన్నతాధికారులు సైతం అసహాయత వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల్లో ఆహార పదార్థాల తయారీకి అవసరమైన కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఈ టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తయి, విద్యా సంవత్సరం ఆరంభం నాటికి కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త టెండర్లను ఆహ్వానించలేదు. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను సుదీర్ఘ జాప్యం తర్వాత చేపట్టిన ప్రభుత్వం..
సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఇతర సరుకుల సేకరణకు మార్గదర్శకాలు రూపొందించి, ఆయా సరుకుల ధరలను సవరించింది. ఆ సరుకుల సరఫరాదారులుగా తమనే కొనసాగించాలని పలువురు పాత గుత్తేదారులు కోర్టును ఆశ్రయించడంతో టెండర్ల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కొత్త రేట్లతో, పాత గుత్తేదారులతోనే గురుకులాలను నిర్వహిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వారు నాణ్యమైన సరుకులను కాకుండా నాసిరకమైన థర్డ్ గ్రేడ్ సరుకులను సరఫరా చేస్తున్నారు.
డైట్ బిల్లులు పక్కదారి పడుతున్నాయని విద్యార్థి సంఘాలు, గురుకుల ఉద్యోగులు, టీచర్లు విమర్శిస్తున్నారు. గుత్తేదారులు, గురుకుల వార్డెన్లు, పలువురు ఉన్నతాధికారులు కుమ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి రూ.2,100 కు, గురుకుల హాస్టళ్లలో 3-7 తరగతి విద్యార్థుల మెస్ చార్జీలను రూ.900 నుంచి రూ.1,330కు, 8-10 తరగతి విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.1,540కు పెంచి, ఆ మేరకు బిల్లులు చెల్లిస్తున్నది. కానీ, వసతి గృహాల్లో గత డైట్‌ను అమలు చేస్తున్నారు. నూతన కామన్ డైట్‌ను అమలు చేయడం లేదు. అయినప్పటికీ పెంచిన రేట్ల ప్రకారమే వార్డెన్లు మెస్ బిల్లులను రాబట్టుకుంటున్నారు. ఆ నిధులను దిగమింగి, విద్యార్థుల పొట్టగొడుతున్నారు.
విద్యార్థి సంఘాలు, కుల సంఘాలతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడితో చేతులు దులుపుకొన్నది. విద్యార్థుల డైట్, కాస్మెటిక్ బిల్లులను గ్రీన్ చానల్లో చెల్లిస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఆచరణలో చేస్తున్నదేమీ లేదు. కామన్ డైట్ అమలు తీరును పరిశీలించిన దాఖలాలే లేవు. దీంతో క్షేత్రస్థాయిలో వార్డెన్లు, గురుకుల ప్రిన్సిపాళ్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే టెండర్లను ఖరారు చేయడంతోపాటు పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.