Uttar Pradesh | ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని బిషప్ జాన్సన్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను సిబ్బంది, సంస్థ చైర్మన్ కలిసి కుర్చీతో సహా బయటకు తోసేశారు. ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్-అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు, దీనిలో ప్రిన్సిపాల్ పారుల్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్త ప్రిన్సిపాల్‌గా షిర్లే మాస్సేను ఆ సంస్థ నియమించింది. బాధ్యతలు చేపట్టడానికి షిర్లే రావడాన్ని గమనించిన పారుల్ ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి, లోపలి నుంచి తలుపు వేసుకున్నారు.
దీంతో ఆ సంస్థ చైర్మన్, సిబ్బంది బలవంతంగా తలుపులు తెరచి, పారుల్‌ను కుర్చీతో సహా బయటకు గెంటేశారు. ఆమె ఫోన్‌ను కూడా లాక్కున్నారు. దీనిపై పారుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. అయితే తాము ఆమెను తాకినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో లేదని సిబ్బంది చెప్తున్నారు. షిర్లే నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు.