హైదరాబాద్ : రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.
ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనుకుంటూనే ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, బిజెపి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లేకుంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అదే భంగ పాటు తప్పదని అనిల్ హెచ్చరించారు.
నాటి నుంచి తెలంగాణ ప్రజల్ని బిజెపి మోసం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే ముందు విభజన హామీలు నెరవేర్చాలని అనిల్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక మోదీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు మోసం చేస్తున్న బిజెపికి ప్రజలు సరైన సందర్భంలో తగిన బుద్ధి చెప్తారని అనిల్ అన్నారు.