ఇంఫాల్, సెప్టెంబర్ 10: జాతుల మధ్య వైరంతో రెండేండ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రధాని మోదీ ఎట్టకేలకు ఈ నెల 13న పర్యటించనున్నారు. 2023 మేలో ఆ రాష్ట్రంలో కుకీ, మైతీ జాతుల మధ్య వైరం ఏర్పడి తీవ్ర హింస ప్రజ్వరిల్లిన తర్వాత తొలిసారిగా మోదీ ఆ రాష్ర్టాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేయడానికి కుకీ-జో వర్గం నిరాకరించింది. కన్నీటితో ఈ నృత్య ప్రదర్శన చేయలేమని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొనడానికి బదులు హింస కారణంగా నిరాశ్రయులై, సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను పరామర్శిస్తే బాగుండేదని ఇంఫాల్ హ్మర్ డిస్ప్లేస్డ్ కమిటీ పేర్కొంది.
చురాచాంద్పూర్ జిల్లాలోని గ్యాంగ్టే స్టూడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రధాని పర్యటనను తాము స్వాగతిస్తామని, అయితే గుండెల్లో దుఃఖం, కన్నీటితో ప్రధాని ఎదుట నృత్యం చేయలేమని చెప్పారు. ‘మా కష్టాలు సమసిపోలేదు. కన్నీళ్లు ఇంకిపోలేదు. మా గాయాలు ఇంకా మానలేదు. ఈ పరిస్థితుల్లో మీతో ఆనందంగా నృత్యం చేయలేం’ అని స్పష్టం చేశారు. అయితే జాతి హింసకు గురైన ప్రజలు తమ గాయాలను నయం చేసుకోవడానికి, తమ మనోవేదనను వ్యక్తం చేసుకోవడానికి ప్రధాని పర్యటన దోహద పడుతుందని తెలిపింది. కుకీ హింపీ మణిపూర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధానికి కచ్చితంగా స్వాగతం పలకాలని, అయితే ఆయన పర్యటన సమష్ఠి ఆకాంక్షలకు న్యాయం, గుర్తింపును అందజేయాలని డిమాండ్ చేశారు. సమస్యకు రాజకీయ పరిష్కారం స్పష్టంగా, స్థిరంగా ఉండాలని, తాత్కాలిక ఊరడింపు చర్యలు ఈ సమస్యకు పరిష్కారం చూపబోవని తెలిపారు.