President Draupadi Murmu | న్యూఢిల్లీ, ఆగస్టు 28: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర భయానకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తనతో పాటు దేశం ఆగ్రహంగా ఉందన్నారు. ఇప్పటివరకు జరిగింది చాలని, మహిళలపై జరిగే నేరాలపై దేశం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కోల్‌కతా ఘటనపై బుధవారం ‘పీటీఐ’కి రాసిన వ్యాసంలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, ప్రజలు నిరసనలు తెలియజేస్తుంటే, నేరస్థులు వేరేచోట్ల సంచరిస్తూనే ఉన్నారని, బాధితుల్లో కేజీ చదివే చిన్నారులూ ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘భవిష్యత్తులో నిర్భయ తరహా ఘటన పునరావృతం కాదని హామీ ఇవ్వగలరా?’ అని ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా తనను కలిసిన స్కూల్ పిల్లలు అమాయకంగా అడిగారని ఆమె గుర్తు చేసుకున్నారు. మహిళలపై నేరాల వక్రబుద్ధి పట్ల దేశం మేల్కొనాలని, మహిళలు తక్కువ శక్తివంతులని, తక్కువ సమర్థులని, తక్కువ జ్ఞానం కలిగిన వారనే ఆలోచనావిధానాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని బుధవారం ఆమె పేర్కొన్నారు. ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు స్త్రీని ఒక వస్తువుగా చూస్తారని అన్నారు. భయం నుంచి స్వేచ్ఛను పొందే మార్గంలో మన ఆడబిడ్డలకు అడ్డంకులు తొలగించేందుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
మీడియా నిర్భయంగా పని చేయాలని, నిజం వైపు నిలబడాలని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆమె తన సందేశాన్ని ఇచ్చారు. మీడియా ఎప్పుడూ గౌరవం పోగొట్టుకోవద్దని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని పేర్కొన్నారు.