న్యూఢిల్లీ, నవంబర్ 26 : రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి రెండు వీడియోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. వేదికపై రాష్ట్రపతి కూర్చోకముందే రాహుల్ గాంధీ కూర్చున్నట్టుగా, మల్లికార్జున ఖర్గే.. ఆయనను నిలబడాల్సిందిగా సూచిస్తున్నట్టుగా ఒక వీడియో ఉంది. మరో వీడియోలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాని మోదీ, ఖర్గే రాష్ట్రపతికి నిలబడి నమస్కరిస్తుండగా, రాహుల్ గాంధీ నమస్కరించనట్టుగా కనిపిస్తున్నది.