హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనుల్లో వేగం పుంజుకొంటున్నది. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు భవనాలను సిద్ధం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ప్రతిరోజూ ఎనిమిది వైద్య కళాశాలల నిర్మాణ పనులను సమీక్షిస్తున్నారు.
జగిత్యాల కాలేజీ భవనాన్ని ఈ నెల 15లోగా, కొత్తగూడెం, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి కాలేజీల భవనాలను ఈ నెల 31లోగా మెడికల్ కాలేజీల యాజమాన్యానికి అప్పగించనున్నారు. మహబూబాబాద్ కాలేజీ భవనాన్ని ఏప్రిల్ 15, రామగుండం కాలేజీ భవనాన్ని మే 31న అందించేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషిచేస్తున్నారు.