హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జేపీఎస్‌లకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం నోటీసులు జారీ చేశారు. జేపీఎస్‌లు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వంతో జేపీఎస్‌లు చేసుకొన్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, సర్వీసు డిమాండ్‌తో ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో తెలిపారు. ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హకులేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో కార్యదర్శులకు చివరి అవకాశం ఇస్తున్నదని తెలిపారు. నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జేపీఎస్‌లు అందరూ టర్మినేట్ అవుతారని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్యదర్శులందరినీ రెగ్యులరైజ్ చేయబోమని, వారి పనితీరును పరిశీలించి సంతృప్తి చెందాకే క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.