హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నదని, ప్రధాని మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి సమక్షంలో సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్‌రెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజేందర్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, మైనారిటీ నేతలు ఎంఏ రషీద్, అబ్దుల్హ్రీం, ఎస్కే జమాల్, బాబా తదితరులకు మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకత్వ లోపంతో సతమతమవుతున్నదని అన్నారు. ప్రజల్లో పార్టీ పలుచన కావడంతో కాంగ్రెస్‌కు చెందిన అన్ని స్థాయిల క్యాడర్ బీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఎన్ని కుట్రలు పన్నినా ఉచిత విద్యుత్తు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. మోదీ తన దోస్తుల కోసం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తు రంగంపై కనీస అవగాహన లేని రాష్ట్ర బీజేపీ నేతలు గల్లీ స్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని, అది వారి అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మార్చి నాటికి విద్యుత్తు పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేశామని, కానీ అందుకు భిన్నంగా ఇప్పటికే ఆ డిమాండ్‌ను చేరుకున్నామని వివరించారు. కేంద్రం, ఎన్టీపీసీ నిర్లక్ష్యానికి తోడు రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడంతో విద్యుత్తు సరఫరాలో కొంత అవరోధం ఏర్పడిందని తెలిపారు. తక్షణమే సీఎం కేసీఆర్ సమీక్షించి, ఎంత ధరైనా చెల్లించి విద్యుత్తు కొనుగోలు చేయాలని ఆదేశించడంతో రెండుమూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతోపాటు ఇతర వినియోగదారులకు విద్యుత్తు సరఫరాలో ఆటంకం ఉండబోదని భరోసా ఇచ్చారు. 17 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు జహీర్, మడిపల్లి విక్రమ్, బీఆర్ఎస్ నేతలు బైరు వెంకన్న, గుడిపూడి వెంకటేశ్వరరావు, సయ్యద్ సలీమ్, మీలా వంశీ, శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.