బెంగళూరు, జూన్ 11: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. తన సహచర నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఛాలెంజింగ్ స్టార్‌గా పేరొందిన దర్శన్‌ను మంగళవారం పోలీసులు మైసూరులోని ఒక హోటల్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో నటి పవిత్రతోపాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న రేణుకాస్వామి.. సామాజిక మాధ్యమంలో నటి పవిత్రా గౌడపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడంతో అతడిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 9న స్వామి మృతదేహం దొరికింది. కామాక్షిపాలస్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తంగెర్లోని ఒక షెడ్లో రేణుకాస్వామిని హత్య చేసి, మృతదేహాన్ని ఒక మురికి నీటి డ్రెయిన్‌లో పడేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో అనుమానితులు 11 మందిని అరెస్ట్ చేశారు. వారి స్టేట్మెంట్లు ఆధారంగా దర్శన్, పవిత్రలను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ హత్యలో దర్శన్ నేరుగా పాల్గొన్నారా? లేక హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్నారా? అన్నది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కరియా, క్రాంతివీర, సంగోల్లి రాయన్న, నవగ్రహ, సారథి, మెజిస్టిక్, బుల్బుల్ వంటి విజయవంతమైన చిత్రాల్లో దర్శన్ నటించారు. అరెస్టు నేపథ్యంలో దర్శన్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.