వాటికన్ సిటీ, ఏప్రిల్ 21 : క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియా, ఊపరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. పోప్ మరణవార్తను వాటికన్ ద్రువీకరించింది. వినయ, విధేయతలు, పేదల పట్ల ప్రేమతో ప్రపంచాన్ని ఆకర్షించిన పోప్ ఫ్రాన్సిస్ పర్యావరణ మార్పులు, పెట్టుబడిదారీ విధానంపై విమర్శలతో సంప్రదాయవాదులకు దూరమయ్యారు. లాటిన్ అమెరికన్ దేశాల నుంచి పోప్ పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తి ఆయన. పోప్ మరణవార్తతో రోమ్‌లోని అన్ని చర్చ్లలోని గంటలను మోగించారు. వాటికన్ కామెర్లెంగో (చర్చి వ్యవహారాల తాత్కాలిక నిర్వాహకుడు) కార్డినల్ కెవిన్ ఫారెల్ వాటికన్లోని పోప్ నివాసమైన డోమస్ శాంటి మార్టా నుంచి ఆయన మరణవార్తను చదివి వినిపించారు. వాటికన్ కాలమానం ప్రకారం ఉదయం 7.35 గంటలకు రోమ్ బిషప్, ఫ్రాన్సిస్.. తండ్రి గృహానికి తిరిగి వెళ్లారు. ఆయన జీవితకాలమంతా ప్రభువు, చర్చి సేవలకే అంకితమయ్యారు’ అని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు దవాఖానలో చికిత్స పొందిన అనంతరం గత నెలలోనే డిశ్చార్జి అయ్యారు. మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్కేర్‌లో కొన్ని వేల మంది ముందుకొచ్చిన ఆయన ఈస్టర్ సందేశమిచ్చారు. ‘సోదర, సోదరీమణులారా ఈస్టర్ శుభాకాంక్షలు..’ అని స్వయంగా పలికారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. యుద్ధం జరుగుతున్న గాజా, ఉక్రెయిన్, సంక్షోభాలతో రగులుతున్న కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.
పోప్ ఫ్రాన్సిస్ మొదటి పేరు జార్జ్ మారియో బెర్గాగ్లియో.. ఆయన 1938లో అర్జెంటీనాలో జన్మించారు. 1969లో ఆయన ప్రీస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1998లో ఆర్చ్‌బిషప్‌గా, 2001లో కార్డినల్‌గా ఎన్నికయ్యారు. పోప్ బెనడిక్ట్-16 ఆకస్మికంగా రాజీనామా చేయడంతో మార్చి 13, 2013లో ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో చాలా మార్పులు, సంస్కరణలను ప్రవేశపెట్టారు. వాటికన్ బ్యాంక్‌లో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. చర్చి నిర్వహణ, పాలనలో పారదర్శకతను అమలుచేశారు. లైంగిక వేధింపుల వంటి కేసుల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. అయితే స్వలింగ సంపర్కుల పట్ల ఆయన సానుకూల ధోరణి సంప్రదాయవాదుల్లో ఆయన పట్ల వ్యతిరేకతను సృష్టించింది. ఈ అంశం క్యాథలిక్ చర్చిలో వివాదాస్పదం కాగా.. ‘దేవుడు తప్ప తాను న్యాయం తీర్చకూడదు’ అని అయన వ్యాఖ్యానించారు. మరణశిక్షపై చర్చి వైఖరిని మార్చిన ఫ్రాన్సిస్ అన్ని పరిస్థితుల్లో అదే శిక్షను అనుమతించరాదని స్పష్టంచేశారు. అణ్వాయుధాలు కలిగి ఉండటం అనైతికత అని ప్రకటించారు. అరేబియన్ ద్వీపకల్పాన్ని సందర్శించి ఇస్లాం-క్రైస్తవ మతాల మధ్య ఐక్యతకు కృషి చేశారు.
పోప్ భౌతిక కాయానికి క్యాథలిక్ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ తంతు తొమ్మిది రోజులపాటు కొనసాగనుంది. తొలుత ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్ బెసిలికాలో ఉంచనున్నారు. తొలి రెండు-మూడు రోజుల్లోనే వివిధ దేశాలకు చెందిన మత పెద్దలు, అధికారులు, కార్డినల్స్, దేశాధినేతలు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. మూడు శవపేటికల్లో పోప్ భౌతిక కాయాన్ని ఉంచి ఖననం చేస్తారు.
పోప్ ఫ్రాన్సిస్ భారత్‌ను సందర్శించకుండానే కన్నుమూయడం భారతీయ క్యాథలిక్‌లను నిరాశపరిచింది. భారత్ నుంచి తాజాగా కార్డినల్‌గా ఎన్నికైన కేరళ మత బోధకుడు జార్జ్ జేకబ్ కూవకడ్ 2025లో పోప్ ఫ్రాన్సిస్ భారత్ వస్తారని పేర్కొన్నారు. పోప్ విదేశీ పర్యటనలను పర్యవేక్షించేది ఆయనే. కేరళలోని సైరో మలబార్ చర్చిలో నెలకొన్న ఓ వివాదాన్ని కూడా ఆయన పరిష్కరించలేకపోయారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తన పదవీకాలంలో ముగ్గురు భారతీయులకు పునీత హోదా కల్పించారు. 2014లో ఫాదర్ కురియాకోస్, సిస్టర్ యూఫ్రేసియా ఎలువతింగల్, 2019లో క్యాథలిక్ నన్, మరియం థ్రేసియాను సెయింట్ (పునీత)గా ప్రకటించారు.పోప్ మృతి సందర్భంగా భారత ప్రభుత్వం మూడు రోజులు సంతపా దినాలుగా ప్రకటించింది.
ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘పోప్ ఫ్రాన్సిస్ పేదల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించారు. అత్యంత చిన్న వయసు నుంచి ఆయన క్రీస్తు ఆదర్శాలకు అంకితం అయ్యారు. పేద, అణగారిన ప్రజలకు సేవలందించారు. భారతీయుల పట్ల ఆయన ప్రదర్శించిన ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాయి. సమ్మిళిత, సర్వతోముఖ అభివృద్ధికి ఆయన ప్రేరణగా నిలిచారు’ అని ఆయన కొనియాడారు.
తన వినయం, సత్ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పోప్ ఫ్రాన్సిస్ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నప్పుడు ప్రేమ విఫలం కావడం వల్ల జరిగి ఉండొచ్చని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు! చిన్నతనంలో తాను సరదాగా అన్న మాటలను భవిష్యత్తులో ఆయనే సాకారం చేసుకున్నారు! బ్యూనస్ ఎయిర్స్‌లోని మెమ్బ్రిల్లర్ వీధిలో ఆయన చిన్నతనంలో (12 ఏండ్ల వయసులో) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న రోజుల్లో తన పొరుగింట్లో ఉండే అమలియా డామెంటే అనే బాలికతో ప్రేమలో పడ్డారు! జార్జ్ తనకు రాసిన ప్రేమలేఖ గురించి అమలియా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాకింకా బాగా గుర్తుంది. అతడు ఎరుపు రంగు పైకప్పు ఉన్న చిన్న తెల్ల రంగు ఇంటి చిత్రాన్ని గీసి నాకిచ్చాడు. మనం పెండ్లి చేసుకున్నప్పుడు ఈ ఇంటిని నేను కొంటాను. నువ్వు నన్ను పెండ్లి చేసుకోకపోతే, నేను ప్రీస్ట్(మతాచార్యుడు) అవుతా! అని అన్నాడు’ అని ఆమె చెప్పారు. అయితే అవి పిల్ల చేష్టలు తప్ప మరేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలిసి తన తల్లి తనను అప్పట్లో కోప్పడ్డారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం కలవకుండా తన తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె వెల్లడించారు. ఆ తర్వా త తమ ఇద్దరి కుటుంబాలు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లిపోయాయని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడూ జార్జ్‌ను కలవలేదని ఆమె తెలిపారు.