హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ-20) వినియోగంతో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేశారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, శ్రీపాల్రెడ్డి, తీన్మార్ మల్లన్న, అంజిరెడ్డి, కొమరయ్య అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఈ-20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతున్నదన్న వార్తల్లో నిజం లేదని, ఈ విషయమై రాష్ట్ర రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు చూస్తున్నాయని, అందువల్ల రాష్ట్ర అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు జారీచేయలేదని చెప్పారు.