హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, వేముల వీరేశం, పాల్వాయి హరీశ్‌బాబు తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకొని శాసనసభలో అందరి ఆమోదంతో ఈ ప్రక్రియ చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘సర్’ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్)పై మంగళవారం శాసనసభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ‘సర్’ సందర్భంగా అర్హులైన ఏ ఒక్కరూ తమ ఓటుహక్కును కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి సర్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరా రు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రస్తావన ఇక్కడ తేవడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఫేక్ ఓట్లను మాత్రమే తొలగించారని, సర్‌ను కేవలం డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకే తెచ్చారని పేర్కొన్నారు.