ఖమ్మం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి చెందినవారే ప్రభుత్వ ఉద్యోగులతో తాను మాట్లాడిన మాటలు విన్నారంటే, తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నా రు. గతంలో వాడిన పరికరాలనే ఉపయోగిస్తున్నారా? అన్న అంశం తేలాల్సి ఉన్నదని, ప్రభుత్వం విచారించి తీరుతుందని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఉద్యోగులు సైతం వార్డుల వారీగా నియమించిన ఉద్యోగుల సంఖ్య, తదితర వివరాలను మంత్రికి వివరించిన ఆడియోను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మంలో మీడియా స మావేశంలో వినిపించారు. వ్యవహారం బట్టబయలు కావడంతో పొంగులేటి జీర్ణించుకోలేకపోయారు.
ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఎన్నికలకు ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలకు మంత్రి స్పందిస్తూ ఓటు ఎవరికి ఉన్నా అభ్యర్థించే హక్కు పార్టీకి ఉంటుందని సమాధానం ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, పార్టీలో సాధారణ కార్యకర్తను మాత్రమేనని పునరుద్ఘాటించారు. టెలికాన్ఫరెన్స్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.