నవీపేట/కోటగిరి, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిస్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఐటీఐ వృత్తి విద్య, డిప్లొమా సాంకేతిక విద్య, ఏటీసీ అడ్వాన్స్ సాంకేతిక విద్య అని, ఈ మూడు ఒకటి ఎలా అవుతాయని ప్రశ్నించారు.
ఐటీఐ విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. జీవో-97లో ఏమి ఉందో రేవంత్‌రెడ్డి సర్కార్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించేందుకు సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో పీడీఎస్‌యూ, డీఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్‌కుమార్, రేహాన్,ఆయాన్,బాల్‌రాజ్, జీవన్ రాథోడ్ ,సాయికుమార్, ఉదయ్, జాదవ్ ప్రణయ్, సామాజిక సేవ కార్యకర్త తోట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.