హార్వర్డ్ యూనివర్సిటీ: మెడికల్ స్కూల్కు దానం చేసిన మృతదేహాలను సరిగ్గా నిర్వహించలేదని, శవాగారం మాజీ మేనేజర్ ఆ శరీర భాగాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించాడని ఆరోపిస్తూ కొన్ని కుటుంబాలు వేసిన దావాలను పరిష్కరించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ 53 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారం మాజీ మేనేజర్ సెడ్రిక్ లాడ్జ్ 2023లో అరెస్ట్ అయిన తర్వాత ఆ సంస్థపై దాఖలైన క్లాస్ యాక్షన్ వ్యాజ్యాలను పరిష్కరించే ప్రతిపాదిత ఒప్పందానికి బోస్టన్లోని స్టేట్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం ప్రాథమిక ఆమోదం తెలిపారు.
హార్వర్డ్ శవాగారంలో లాడ్జ్ దాదాపు మూడు దశాబ్దాలు పనిచేశాడు. వైద్య పరిశోధన, విద్య కోసం పాఠశాలకు దానం చేసిన మృతదేహాల నుంచి అవయవాలు, ఇతర భాగాలను దొంగిలించి విక్రయించినందుకు అతడికి ఫెడరల్ జడ్జి నిరుడు డిసెంబర్లో ఎనిమిదేండ్ల జైలు శిక్ష విధించారు. 2018 నుంచి అతడు అవయవాల విక్రయానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు.