ఆదిలాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంటున్నాయి. ఆ ప్రాంతానికి వారు కుమ్రం భీం కాలనీగా నామకరణం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి సైతం పట్టాల సమస్యను తెలియజేశారు.
ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సోమవారం కాలనీవాసులు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో కాలనీకి చేరుకొని ఆదివాసీలను అడ్డుకున్నారు. తుడుందెబ్బ నాయకులు, కాలనీవాసులను పోలీసులు అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. రెవెన్యూ అధికారులు వచ్చి మాట్లాడటంతో వారిని విడుదల చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అడిషనల్ కలెక్టర్ చిత్రు హామీ ఇచ్చారు.