యాదాద్రి భువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ): భువనగిరి మెప్మా కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు వినతిపత్రం అందించారు. అవినీతి ఆరోపణల్లో భాగంగా కేవలం కొంత మంది ఆర్పీలను మాత్రమే విచారించారని, వారితోపాటు మెప్మాలో ఉన్న అధికారులను కూడా విచారించాలని కోరారు. దోషులని తేలితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏడు కోట్ల ఈ కుంభకోణం కేసు లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా శిక్షించాలని, ఆ డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కొంత మంది అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అండదండలు ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని, దీని వెనకాల ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్, రాజు ఉన్నారు.